ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్

                                              APTF 2004 జూలైలో ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిన నేపధ్యంలో నిబంధనావళిని ప్రభుత్వ నిబంధనల కనుగుణంగా రాష్ట్రసంఘం 2005న నవరించింది. దీనికి మరికొన్ని సవరణలను రాష్టసంఘం 2010లో ప్రతిపాదించి చర్చించింది. వీటిని 2011లో విజయవాడలో జరిగిన రాష్ట్ర జనరల్ కౌన్సిల్ చర్చించి, ఆమోదించింది. సవరించిన నిబంధనావళి అమలులోనికి రాకముందే జూన్ 2న రాష్ట్ర విభజన జరిగినందున 23-11-2014న విజయవాడలో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ నిబంధనావళిని నవరించింది. సవరించిన నిబంధనావళిని దిగువనిస్తున్నాం.

1.ఈ సంఘము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్అని పిలువబడును. దీని సంక్షిప్త నామము ఏ.పి.టి.ఎఫ్.

2.ఆంధ్రప్రదేశ్ అంతటా పనిచేయును. కార్య స్థానము : విజయవాడ

            

                                             APTF  సంఘ ఆశయాలు 

1. భారత రాజ్యాంగంలో నిర్దేశించబడిన సమసమాజ నిర్మాణ ధ్యేయం గల శాస్త్రీయ విద్యా విధానమును సాధించుట.

 2. (ఎ) విద్యను ప్రాథమిక హక్కుగా అమలు పరుచుటకు కృషి చేయుట. (బి) వివిధ యాజమాన్యాల స్థానంలో విద్యాధికారుల, ఉపాధ్యాయ – విద్యార్థి ప్రతినిధుల, ప్రజా ప్రతినిధులు, విద్యావేత్తలతో కూడిన చట్టబద్ధమైన విద్యాబోర్డులను ఏర్పరచుటకు, వాటిద్వారా విద్యాపాలన సాగించుటకు కృషి చేయుట.

3. అన్ని దశలలోని విద్యావ్యాప్తిని, వయోజన విద్యాభివృద్ధిని సాధించుట,

 4. విద్యా విధానాలు, బోధనా పద్ధతులను అభివృద్ధి పరచుట.

 5. విద్యాపాలన, బోధన అన్ని స్థాయిలలోను మాతృభాషలోనే సాగించుటకు కృషిచేయుట.

6. విద్యారంగ సమస్యలకు సంబంధించిన గ్రంథములు, కరపత్రములు, పత్రికలు

ప్రచురించుట, విద్యా విషయక సాహిత్యమును ప్రచురించుట.

 7. ప్రజల విజ్ఞానాభివృద్ధి కొరకు పాటుపడుట.

8. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉపాధ్యాయులనందరిని ఒకే సంఘంగా ఏర్పరచుట.

 9. ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రయోజనాలను కాపాడునట్లు సమగ్ర విద్యా చట్టాన్ని

సవరించుటకు కృషి చేయుట.

10. (ఎ) ఉపాధ్యాయుల ఆర్థిక, సాంఘిక భద్రతకు కృషి చేయుట.

(బి) ఉపాధ్యాయుల సాంస్కృతిక, వైజ్ఞానిక, అభివృద్ధితో బాటు సామాజిక బాధ్యతలను | గుర్తింపజేయుట.

(సి) ఉపాధ్యాయుల రాజకీయ హక్కుల సాధనకు కృషి చేయుట.

(డి) ఉపాధ్యాయ సంఘాలకు ట్రేడ్ యూనియన్ హక్కుల సాధనకు కృషి చేయుట

11. కేంద్ర ఉపాధ్యాయులకు గల వేతన తదితర సదుపాయాలు రాష్ట్ర ఉపాధ్యాయులకు వర్తింపచేయుటకు కృషి చేయుట.

12. విద్యకు సంబంధించిన అన్ని స్థాయిల కమిటీలలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించుట.

13.విద్యారంగంలో అవినీతి, అక్రమాల నిర్మూలనకు కృషి చేయుట.

 14. పౌర హక్కుల, ప్రజాస్వామ్య హక్కుల రక్షణకు కృషి చేయుట.

15. ప్రజాతంత్ర ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించుట.

 

                        APTF సంఘ ఆశయాల సాధనకు మార్గాలు

1. పై ఆశయాలు సాధనకు సభలు, సమావేశాలు, సదస్సులు, గోష్ఠులు నిర్వహించుట.

2. ప్రాతినిధ్యాలు, విజ్ఞప్తులు, రాయబారాలు నిర్వహించుట. ప్రదర్శనలు, రిలే నిరాహారదీక్షలు, ధర్నా పికెటింగ్, సమ్మె వగైరా కార్యక్రమాలు నిర్వహించుట, ప్రత్యేక పరిస్థితిలో న్యాయస్థానాలకు వెళ్ళుట..

 3. అకడమిక్ సెల్ ద్వారా విద్యా ప్రణాళికలు రచించి, వాటిని ప్రభుత్వం అమలు జరుపుటకు ప్రజా సహకారంతో కృషి చేయుట.

 4. విద్యలో సమాన అవకాశాల సాధనకు, ఉమ్మడి పాఠశాల వ్యవస్థ కొరకు కృషిచేయుట.

 5. స్వతంత్ర ప్రతిపత్తికి భంగంలేని పద్ధతిలో మన ఆశయాల సాధనకు జాతీయ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఏర్పాటుకు కృషి చేయుట. అంతర్జాతీయ ఉపాధ్యాయ ఉద్యమంతో సంబంధాలను ఏర్పరచుకొనుట.

6. రాష్ట్ర జాతీయ, అంతర్జాతీయ సంఘాలమధ్య ఆశయసామ్యం గల ఇతర సంఘాల మధ్య సౌహార్ద్రతను పెంపొందించుటకు ప్రతినిధులను పంపుట, ఆహ్వానించుట.

 7. ఫెడరేషన్ అధికార పత్రిక 'ఉపాధ్యాయ' ద్వారా పై ఆశయాల సాధనకు కృషి చేయుట.

8.వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, కరపత్రములు, పుస్తకములు తదితర పద్ధతుల ద్వారా ప్రజలలో ప్రచారం గావించి, ప్రజా సహకార సానుభూతులను సాధించుట.

9. రాష్ట్రంలో ఇతర ఉపాధ్యాయ సంఘాలతోను మరియు ఉద్యోగ కార్మిక సంఘాలతోనుఏర్పడిన ఐక్య సంఘటనల్లో భాగస్వామిగా వుండి కార్యాచరణకు పూనుకొనుట.

10, సంఘ ఆశయాల సాధనలో భాగంగా యితర ప్రజా సంస్థలతో కలిసి కృషి చేయుట,ప్రజా పోరాటాల్లో పరస్పరం సహకరించుట.

11, బాధితోపాధ్యాయుల కుటుంబాల సహాయార్ధం నిధులను ప్రోగుచేసి వారికందించి సహాయపడుట.

 

                               APTF  సంఘ సభ్యత్వం -నియమాలు

1. ఆంధ్రప్రదేశ్లో ప్రాథమికస్థాయి నుండి విశ్వవిద్యాలయం వరకు ప్రభుత్వగుర్తింపు ఉన్న విద్యాసంస్థల్లో పనిచేయుచున్న-చేసినవారు ఫెడరేషన్సభ్యులుగా చేరుటకు అర్హులు

2. ఫెడరేషన్ ప్రాథమిక సభ్యులుగా చేరువారు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆశయాలను, నిబంధనావళిని అంగీకరించి, నిర్ణయించిన సభ్యత్వరుసుం చెల్లించవలెను.

3. నిర్మాణంలేని ప్రాంతంలో అర్హత కలిగిన ఎవ్వరినైనను ప్రాథమిక సభ్యులుగా చేర్చుకొనుటకు-ఆ పై శాఖ హక్కు కలిగి ఉండును.

4. ఫెడరేషన్ సభ్యులుగా చేరదలచినవారు 1 ప్రతి సంవత్సరం జూన్ లో పాఠశాలల ప్రారంభం నుండి ఆగస్టు ఆఖరులోగా చేరవలెను. వారు ఆ సంవత్సరం ఎన్నికల్లో పాల్గొన అర్హులు. ప్రత్యేక పరిస్థితులలో అ గడువును మార్చుటకు రాష్ట్ర సబ్ కమిటీ, ఆ పై కమిటీలకు అధికారం ఉండును.

5. ఫెడరేషన్ సభ్యత్వ రుసుం సంవత్సరానికి రు. 100 (వంద రూపాయలు) చెల్లించి  ఫెడరేషన్ లో చేరర్హులు

 6. సభ్యత్వ రుసుంలో రు. 40లు మండల/పట్టణ/నగర శాఖలకున్నూ, రు. 30లు జిల్లా శాఖకున్నూ, రు. 30లు రాష్ట్ర సంఘానికి చెందవలెను.

7. ఫెడరేషన్ శాఖలైన మండల/పట్టణ/నగర శాఖలు లేనిచోట్ల, ఆ శాఖలకు నిర్ణయించిన భాగంతోసహా పూర్తి సభ్యత్వం జిల్లా శాఖలకు చెందవలెను. ప్రాథమిక శాఖలైన మండల లేక పట్టణ లేక నగరశాఖ, జిల్లాశాఖలు లేనిచోట్ల ఈ రెండు శాఖల భాగములతో సహా పూర్తి సభ్యత్వం రాష్ట్ర ఫెడరేషన్ కు చెందవలెను.

8.సెప్టెంబరు 10వ తేదీ లేక ఆలోపు మండల/పట్టణ/నగర శాఖలు జిల్లా శాఖల ప్రధాన కార్యదర్శులకు, సెప్టెంబరు 25వ తేదీ లేక ఆలోపు జిల్లా శాఖల ప్రధాన కార్యదర్శులు సభ్యత్వరుసుంను, సభ్యుల జాబితాలను, కౌంటర్ ఫాయిల్స్ ను స్ర్కూటిని చేసి ఒకేసారి రాష్ట్ర సంఘానికి చేర్చాలి. సెప్టెంబరు 25వ తేదీన నగదుగాగాని లేక ఎం.ఓ.ద్వారాగాని, డి.డి. ద్వారాగాని చెల్లించవచ్చును. డి.డి.లు ఆరోజునగానీ, మరుసటి రోజునగాని పోస్టులో పంపాలి.

 

 

                                జనరల్ ఫండ్ - నియమాలు 

1. ప్రతి సంవత్సరం జనరల్ ఫండ్ క్యాంపెయిన్ జూన్లో పాఠశాలల ప్రారంభంనుండి ఆగస్టు 31 వరకు సాగించాలి.

2. జనరల్ ఫండ్లో మండల/పట్టణ/నగరశాఖలకు 50 శాతం, జిల్లా శాఖకు 25 శాతం, రాష్ట్ర సంఘానికి 25 శాతం చెందవలెను.

3.జనరల్ ఫండ్ కౌంటరుఫాయిల్స్, జాబితాలు రెండు ప్రతులు చొప్పున మండల/ పట్టణ/నగర శాఖలు సెప్టెంబరు 10 లోగా జిల్లా, రాష్ట్ర కోటా సొమ్ముతో సహా జిల్లా శాఖలకు చేర్చాలి. రాష్ట్ర కోటా సొమ్ము, జాబితాలు - కౌంటర్ఫాయిల్స్ తో సహా సెప్టెంబరు 25లోగా జిల్లా శాఖలు రాష్ట్ర సంఘానికి చేర్చాలి. సెప్టెంబరు 25వ తేదీన నగదుగాగాని లేక ఎం.ఓ. ద్వారాగానీ డి, డి. ద్వారాగాని చెల్లించవచ్చును. డి.డి.లు ఆరోజునగాని మరుసటిరోజుగాని పోస్టులో పంపాలి. జనరల్ ఫండ్ జాబితాలు, కౌంటర్ఫాయిలు వసూలు చేసిన సొమ్ముతో సహా సకాలంలో క్రింది శాఖలు పైశాఖలకు అందజేయవలెను. లేనియెడల ఆయా శాఖల బాధ్యులపై క్రమశిక్షణాచర్యలు తీసుకొనబడును.

   

                      APTF రాష్ట్ర శాఖ నిర్మాణం

 

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కు మూడు పాలక వర్గము లుండను:

                     1. జనరల్ కౌన్సిల్, 2. కార్యవర్గము, 3. సబ్ కమిటి.

1. అన్ని జిల్లాల నుండి ఎన్నుకోబడిన రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, గత సంవత్సరం ఫెడరేషన్ ఆఫీసు బేరర్లతో రాష్ట్ర కౌన్సిల్ ఏర్పడును. అన్ని జిల్లాల నుండి రెండు సంవత్సరాల సగటు ప్రాథమిక సభ్యత్వ ప్రాతిపదికపై ఎన్నుకోబడవలసినవారు 151 మంది, ఫెడరేషన్ రాష్ట్ర సబ్ కమిటీ సభ్యులు ఎన్నిక లేకనే ఫెడరేషన్ ఎక్స్అఫిషియో కౌన్సిల్ సభ్యులగుదురు.

 2. రెండు సంవత్సరాల సగటు ప్రాథమిక సభ్యత్వ దామాషాను బట్టి వివిధ జిల్లాలకు కౌన్సిల్ సభ్యుల సంఖ్య నిర్ణయించబడును. జిల్లా నుండి ఎన్నికయ్యే ప్రతి 6 గురు రాష్ట్ర కౌన్సిలర్లకు ఒక మహిళను ఎన్నుకోవాలి. అంటే జిల్లాలోని ప్రతి 6వ రాష్ట్రకౌన్సిలర్ మహిళా ప్రతినిధి అయివుండాలి.

3. జిల్లాలకు నిర్ణయించబడిన జనరల్ కౌన్సిల్ సభ్యులను ఆయా జిల్లాల కౌన్సిల్ సభ్యుల

నుండి ఎన్నుకోవలెను.

4.ఎన్నికజరిగే సంవత్సరం సభ్యులుగా వున్నవారే ఎన్నికలలో పాల్గొనుటకు అర్హులు.

5.రాష్ట్ర, జిల్లా శాఖల కౌన్సిలర్ల సంఖ్యకు లోబడి, ఆయా శాఖలకు వరుసగా జిల్లా మండల/పట్టణ/నగరశాఖల ప్రధానకార్యదర్శి, అధ్యక్షుడు రెండు పోస్టులను మినహాయించి మిగిలిన సంఖ్యను మాత్రమే పైశాఖల కౌన్సిలర్లుగా ఎన్నుకోవాలి.

6. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు ఎన్నిక జరిగిన తేదీ నుండి నూతన సంబంధిత జిల్లా శాఖ ఎన్నికల కౌన్సిల్ జరుగు తేది వరకు సదరు హోదాలో యుండును.

7. సబ్ కమిటీని, కార్యవర్గాన్ని రెండు సంవత్సరముల కొక ఎన్నుకొనవలెను.

8. సబ్ కమిటీ, కార్యవర్గం చేసిన నిర్ణయాలు, ఖర్చు పెట్టి కౌన్సిల్ యొక్క ఆమోదమును పొందవలెను. పొందని నిర్ణయములు రద్దు చేయబడును

9.జనరల్ కౌన్సిల్ సమావేశమునకు హాజరైన కౌన్సిల్ సభ్యులలో 2/3 వంతు విశ్వాసరాహిత్య తీర్మానంతో సబ్ కమిటీ కార్యవర్గమునుగాని, దానిలోని సభ్యులనుగాని తొలగించ వచ్చును.

                                                                     2. సబ్ కమిటీ

1. రాష్ట్ర సబ్ కమిటీకి ఒక అధ్యక్షుడు, ఒక ప్రధానకార్యదర్శి, ఐదుగురు ఉపాధ్యక్షులుఆరుగురు కార్యదర్శులు ఉందురు. ఉపాధ్యక్షవర్గంలో ఒక స్థానం, కార్యదర్శులలో ఒక స్థానం మహిళలకు రిజర్వు చేయబడింది. వీరిని జనరల్ కౌన్సిల్ నుండి ఎన్నుకొనవలెను.ఉపాధ్యాయ ప్రధాన సంపాదకులు, ఫెడరేషన్ లో గల మాజీ శాసనమండలి సభ్యులు రాష్ట్ర సబ్ కమిటీలో ప్రత్యేకాహ్వానితులుగా ఉందురు.

2. సంఘ కార్యకలాపాలపై నిర్ణయాలు తీసుకొని వ్యవహరించుటకు సబ్ కమిటీకి అధికారం గలదు.

3. అధ్యక్షుడు తన విధులను నిర్వర్తించుటకు అవకాశం లేనపుడు ఉపాధ్యక్షులలో ఒకరికి అధ్యక్షుని విధులను అప్పగించు అధికారం సబ్ కమిటీ కలిగివుండును.

4. ప్రధాన కార్యదర్శి తన విధులను నిర్వర్తించుటకు అవకాశం లేనపుడు కార్యదర్శులలోఒకరికి ప్రధానకార్యదర్శి విధులను అప్పగించు అధికారం సబ్ కమిటీ కలిగి ఉ ండును.

                                                                                3 కార్యవర్గము

1. ఫెడరేషన్ కార్యవర్గం - రాష్ట్ర సబ్ కమిటీ సభ్యులు, జిల్లా శాఖల ప్రధాన కార్యదర్శులు,రిజర్వుడు స్థానాలకు ఎన్నుకొనబడిన సభ్యులు - 22 మందితో రాష్ట్ర కార్యవర్గం ఏర్పడును. ఈ 22 మందిలో జిల్లాకు ఒక్కొక్కరు చొప్పున 15 మంది, లింగ్విస్టిక్ మైనారిటీల నుండి ఇద్దరు, ఏజెన్సీ పాఠశాలల నుండి ఇద్దరు, మహిళా ఉపాధ్యాయుల తరఫున ముగ్గురు ఉందురు.

2. సబ్ కమిటీలో ఖాళీ అయిన స్థానాలకు రాష్ట్ర కౌన్సిలర్ల నుండి రాష్ట్ర కార్యవర్గం కో-ఆఫ్ట్ చేసుకొనవచ్చును. రాష్ట్ర కార్యవర్గ సభ్యులలో ఏ అర్హతగల స్థానమునకు ఖాళీ వచ్చిన అదే అర్హతగల స్థానమునకు కో-ఆఫ్ట్చే   చేసుకొనుటకు రాష్ట్ర కార్యవర్గం అధికారం కలిగిఉండును.

                                                                                 4  .విధులు

                                                     అధ్యక్షుడు

1) ఫెడరేషన్ కార్యక్రమములను ఎప్పటికప్పుడు నలహాలను, నూచనలిచ్చినడుపుచుండవలెను.

2) జనరల్ కౌన్సిల్, కార్యవర్గం, సబ్ కమిటీ సమావేశాలకు అధ్యక్షత వహించును.

3).అత్యవసర పరిస్థితులలో జనరల్ కౌన్సిల్, కార్యవర్గం, సబ్-కమిటీ సమావేశాలను పిలువమని ప్రధాన కార్యదర్శిని కోరును. ప్రధాన కార్యదర్ని సమావేశమును పిలువని పక్షంలో తానే పై సమావేశములను పిలువవచ్చును.

                           ప్రధాన కార్యదర్శి

అ) ఆఫీసు నిర్వహణను, ఫెడరేషన్ కార్యక్రమాలను నిర్వహించును.

ఆ) జనరల్ కౌన్సిల్, కార్యవర్గము, సబ్ కమిటీ సమావేశాలను పిలుచుటకు అధికారము కలిగి ఉండును.

 ఇ) ప్రధాన కార్యదర్శి కోశాధికారిగా పనిచేయును.అత్యవసరమైనపుడు సబ్ కమిటీ అనుమతితో అప్పు తెచ్చుటకును, అప్పు తీర్చుటకును ఇచ్చుటకును అధికారమును కలిగియుండును.

                                     ఉపాధ్యక్షులు, కార్యదర్శులు

         సబ్ కమిటీ నిర్దేశించిన నిర్మాణ ఉద్యమ బాధ్యతలను నిర్వర్తింతురు. తమకు కేటాయించిన జిల్లా శాఖల నిర్మాణ ఉద్యమ కార్యక్రమాలనుమార్గదర్శకత్వం వహింతురు

                                    ప్రత్యేకాహ్వానితులు

      ప్రత్యేకాహ్వానితులు సబ్ కమిటీకి తగు సూచనలిచ్చి సహకరింతురు.

                                  కార్యవర్గ సభ్యులు

అ) ఫెడరేషన్ ప్రతినిధులుగా తాము ప్రాతినిధ్యం వహించు జిల్లాలలో కార్యక్రమములను అమలు జరిపించు బాధ్యతలను కలిగి ఉందురు.

                                      రాష్ట్ర కౌన్సిలర్లు

అ) రాష్ట్ర కౌన్సిలర్లు జిల్లా శాఖ సబ్ కమిటీ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరగుదురు.

ఆ) వారు ఉన్న జోన్లో జోనల్ కమిటీకి కో-కన్వీనర్గా వ్యవహరింతురు.

ఇ) జిల్లాశాఖ కార్యవర్గానికి ఎన్నికలేకనే కార్యవర్గ సభ్యులుగా వ్యవహరింతురు.

 ఈ) రాష్ట్ర సంఘ కార్యక్రమాలను అమలు జరుపుదురు.                                     

                   APTF జిల్లా శాఖల నిర్మాణం & మండలపట్టణ/నగర శాఖల నిర్మాణం 

1. జిల్లా శాఖకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్....... జిల్లా శాఖ అని పేరు.

2. జిల్లా శాఖకు కౌన్సిల్, కార్యవర్గం, సబ్ కమిటీ అను మూడు పాలక వర్గములుండును.

3.జిల్లాలో మండల/పట్టణ/నగర శాఖల నుండి 10 మంది నుండి 20 మంది వరకు ప్రాథమిక సభ్యులకు ఒక జిల్లా కౌన్సిలరు, ఆపైన 10కి తక్కువ కాకుండా 20 మందికి ఒకరు చొప్పున జిల్లా కౌన్సిలర్లను ఎన్నుకొనవలెను. 10 మందికి తక్కువ సభ్యత్వం గల మండల/పట్టణ/నగర శాఖల నుండి జిల్లా కౌన్సిలర్లు ఉండరు. (10 నుండి 29 వరకు ఒక్కరు, 30 నుండి 49 వరకు ఇద్దరు, 50 నుండి 69 వరకు ముగ్గురు, 70 నుండి 89 వరకు నలుగురు 90 నుండి 109 వరకు ఐదుగురు దామాషాలో ఎన్నుకొనవలెను) ప్రతి ఐదుగురు జిల్లా కౌన్సిలర్లకు ఒక మహిళా కౌన్సిలర్ చొప్పున ఎన్నుకోవలెను. అంటే ఐదవ, పదవ, పదిహేనవ జిల్లా కౌన్సిలర్ పదవి మహిళా ప్రతినిధికి రిజర్వ్ చేయబడింది.

4. గత సంవత్సరం జిల్లా శాఖ ఆఫీసు బేరర్లు, గత సంవత్సరం ఆ జిల్లా జనరల్ కౌన్సిల్ సభ్యులు, ఆ జిల్లాలో ఉన్న ఎక్స్ అఫీషియో జనరల్ కౌన్సిల్ సభ్యులు ఎన్నికలేకనే జిల్లా కౌన్సిల్ సభ్యులగుదురు.

 5. జిల్లా సబ్ కమిటీని జిల్లా కౌన్సిల్ నుండి ఎన్నుకొనవలెను. ఈ కమిటీలో ఒక అధ్యక్షుడు, నలుగురు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ఐదుగురు కార్యదర్శులు ఉందురు , ఉపాధ్యక్ష వర్గంలో ఒక స్థానం మహిళకు రిజర్వు చేయబడింది. 3000 సభ్యత్వం మించిన జిల్లాలో సబ్ కమిటీ సభ్యులు 13 మంది వారిలో ఒకఉపాధ్యక్షపదవి, ఒక కార్యదర్శి పదవి మహిళలకు కేటాయించాలి.

 6.జిల్లా సబ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర కౌన్సిలర్లు, మండల/పట్టణ/నగర శాఖల ప్రధాన కార్యదర్శులు జిల్లాశాఖ అవసరాలను బట్టి లింగ్విస్టిక్ మైనారిటీస్, ఏజెన్సీ, మహిళా రిజర్వు స్థానాలకు 6 గురికి మించకుండా ఎన్నిక కాబడినవారు జిల్లాశాఖ కార్యవర్గంలో ఉందురు. మండల/పట్టణ/నగర శాఖల అధ్యక్షులు జిల్లా శాఖకార్యవర్గసమావేశానికి ప్రత్యేకాహ్వానితులుగా హాజరగుదురు.

7.    500 ఆ పైన సభ్యత్వం కలిగి వున్న నగర శాఖలు జిల్లా శాఖ ప్రతిపత్తి కలిగి ఉండును. వీటికి జిల్లా శాఖల నిర్మాణం, నిబంధనలే వర్తించును. 

8. రాష్ట్ర సబ్ కమిటీ సభ్యులవలె జిల్లా శాఖ సబ్ కమిటీ సభ్యులు తమ విధులు నిర్వర్తింతురు. 

9. జోనల్ కమిటీలు:

అ) జిల్లా శాఖ తన అవసరాలకనుగుణంగా జిల్లా సబ్ కమిటీ సభ్యుల సంఖ్యకు మించకుండా జిల్లాలో జోన్లను ఏర్పాటు చెయ్యాలి.

ఆ) జిల్లా శాఖ ఒక సబ్ కమిటీ సభ్యుడు జోనల్ కమిటీ కన్వీనర్ గాఉండాలి. జిల్లా సబ్కమిటీ సభ్యుడు లేని జోన్ కు రాష్ట్ర కౌన్సిలర్ జోనల్ కమిటీ కన్వీనర్గా ఉండాలి.

ఇ) ఆ జోన్ పరిధిలోని మండల/పట్టణ/నగర శాఖల సబ్ కమిటీ సభ్యులు, జిల్లా కౌన్సిలర్లుజోనల్ కమిటీ సభ్యులుగా ఉంటారు. కన్వీనర్, కో కన్వీనర్, మండల/పట్టణ/నగర శాఖల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జోనల్ సారధ్య సంఘం (స్టీరింగ్ కమిటీ)గా వ్యవహరింతురు.

ఈ) ఒక సంవత్సర కాలలో ఒక జోనల్ సమావేశం, ఒక స్టీరింగ్ కమిటీ సమావేశం విధిగా జరగాలి.

                            మండలపట్టణ/నగర శాఖల నిర్మాణం

1. మండల లేక పట్టణ లేక నగర శాఖకు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ........మండల/పట్టణ/నగరశాఖ.........జిల్లా అని పేరు.

 2. మండల/పట్టణ/నగర శాఖకు సబ్ కమిటీ, కార్యవర్గం అను రెండు పాలకవర్గములుండును. మండల/పట్టణ/నగర శాఖలలోని ప్రాథమిక సభ్యులతో కూడిన జనరల్ బాడీ పై పాలక వర్గములను ఎన్నుకొనును.

3. 100 వరకు సభ్యత్వం గల మండల/పట్టణ శాఖకు ఒక అధ్యక్షుడు, ఒక ప్రధానకార్యదర్శి, ఇద్దరు ఉపాధ్యక్షులు, ముగ్గురు కార్యదర్శులు ఉందురు. ఇద్దరు ఉపా ధ్యక్షులలో ఒకరు మహిళ ఉండాలి. 100 సభ్యత్వం పైబడిన మండల/పట్టణ శాఖకు ఒక అధ్యక్షుడు, ఒక ప్రధాన కార్యదర్శి, ముగ్గురు ఉపాధ్యక్షులు, నలుగురు కార్యదర్శులు ఉందురు. వీరిలో ఒక ఉపాధ్యక్షులు, ఒక కార్యదర్శి స్థానాలు మహిళలకు రిజర్వు చేయబడ్డాయి. 200 సభ్యత్వం పైబడిన మండల/పట్టణ/నగర శాఖలకు ఒక అధ్యక్షుడు, ఒక ప్రధాన కార్యదర్శి, నలుగురు ఉపాధ్యక్షులు, ఐదుగురు కార్యదర్శులు ఉందురు. వీరిలో ఒక ఉపాధ్యక్షుడు, ఒక కార్యదర్శి స్థానాలు మహిళలకు రిజర్వు చేయబడ్డాయి.

4.మండల/పట్టణ/నగరశాఖ సబ్ కమిటీ సమావేశాలకు ఆ మండల/పట్టణ/నగరంలో గల జిల్లా శాఖ సబ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులుగాను,జిల్లా కౌన్సిలర్లు ప్రత్యేక ఆహ్వానితులుగాను హాజరవుతారు.

5. మండలపట్టణ/నగరశాఖల జనరల్ బాడీ సభ్యుల నుండి ఎన్నుకొనవలసిన కార్యవర్గంసంఖ్యను రిజర్వు సీట్ల సంఖ్యను ఆ మండల/పట్టణ/నగరశాఖల అవసరాలను బట్టి వారి జనరల్ బాడీలో నిర్ణయించుకొనవలెను.

  

                                             APTF -  జనరల్ నిబంధనలు

                                           1. సమావేశములు

అ) ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా, మండల, పట్టణ, నగర శాఖల కౌన్సిల్ సమావేశములు తిరిగి నూతన కౌన్సిల్ ఏర్పడు లోపల కనీసం రెండు పర్యాయములు జరుపవలెను. ప్రారంభ సమావేశం, మధ్యంతర సమావేశం.

ఆ) కౌన్సిల్ సమావేశములకు ముందు కార్యవర్గం, కార్యవర్గ సమావేశానికి ముందు సబ్ కమిటీ సమావేశం జరుపవలెను.

ఇ) సబ్ కమిటీ సమావేశములు కార్యవర్గ సమావేశాలకు ముందు తప్పక జరుగవలెను.అన్ని సమావేశాల్లోను నిర్ణయాలు ఆ సమావేశమునకు హాజరైన మెజారిటీ సభ్యుల అభిప్రాయమును బట్టియే తీర్మానించవలెను. ఓటింగు సమానమైనచో అధ్యక్షుని ఓటుతో నిర్ణయించవలెను.

                                                               2. కోరము

అ) ఫెడరేషన్ జిల్లా/మండల/పట్టణ/నగర శాఖల కౌన్సిల్/జనరల్ బాడీ సమావేశాలకు 1/5 వంతును, నగర జనరల్ బాడీ సమావేశాలకు 1/8 వంతును, కార్యవర్గ సమావేశాలకు 1/3 వంతును, సబ్ కమిటీ సమావేశాలకు మెజారిటీని కోరంగా భావించవలెను. విశ్వాసరాహిత్య తీర్మాన ప్రతిపాదనకు అన్ని శాఖలు, కౌన్సిల్, జనరల్ బాడీ సమావేశాలలో 3/4 వంతు కోరంగా ఎంచవలెను.

                                                     3. సమావేశాలకు నోటీసు

అ) మహాసభలకు 15 రోజులు ముందుగాను, కౌన్సిల్ సమావేశాలకు 10 రోజులుముందుగాను, సబ్ కమిటీ కార్యవర్గ సమావేశములకు 7 రోజులు ముందుగాను, అత్యవసర సబ్ కమిటీ సమావేశాలకు 2 రోజులు ముందుగాను నోటీసులు సభ్యులకు అందజేయవలెను.

ప్రధాన కార్యదర్శులను కోరినపుడు ఆయా సమావేశాలను ఒకనెలలోగా విధిగా సమావేశ పరచవలెను. అట్లు సమావేశ పరచ సభ్యులే సమావేశములను పిలువవచ్చును. జిల్లా శాఖల, రాష్ట్ర సబ్ కమిటీ సభ్యులు ఆయా పోస్టులకు అర్హత కోల్పోవుదురు.

                                      4. ఆడిట్ కమిటీ

అ) శాఖలు ప్రతి సంవత్సరం జమా ఖర్చులు ఆడిట్ చేయించి ఆడిట్ రిపోర్టును పై శాఖలకు పంపుచుండవలెను. 

 

ఆ) ఒక కన్వీనర్ ను, ఇద్దరు సభ్యులను ఆడిట్ కమిటీగా రాష్ట్ర, జిల్లా కౌన్సిల్ మరియు మండల/పట్టణ/నగర జనరల్ బాడీ ఎన్నుకొనవలెను.

 

                                 5. ప్రత్యేక అధికారాలు

 అ) నిబంధనావళిని అమలు పరుచుటలో ఉత్పన్నమగు సమస్యలను పరిష్కరించుటకు ఫెడరేషన్ సబ్ కమిటీ అధికారము కలిగియుండును.

 ఆ) ఏ పదమునకుగాని, వాక్యమునకుగాని ఫెడరేషన్ సబ్ కమిటీ యిచ్చు నిర్వచనమే ఖాయమైనది.

ఇ) నిబంధనావళిలోగాని లేక నిబంధనావళిని అమలు జరుపుటకు ఉద్దేశింపబడినరూల్సులోగాని నిర్వచించిన వాటిని పరిశీలించి నిర్ణయించు అధికారము ఫెడరేషన్ సబ్ కమిటీ కలిగియుండును.

ఈ) సబ్ కమిటీ పరిష్కరించజాలని విషయాలను కార్యవర్గం ఎదుట, కార్యవర్గం పరిష్కరించజాలని విషయాలను కౌన్సిల్/జనరల్ బాడీల ఎదుట ఉంచవలెను. వారి తీర్పే ఖాయమైనది.

ఉ) నిబంధనావళి ఎంత అధికారయుతమైనదో దానిని అమలు జరుపుటకు తయారు చేయబడిన రూల్సుకూడా అంతటి అధికారం గలవిగా వుండును.

 

                                    నిబంధనావళి-నియమాలు

           నిబంధనావళి 3,4,6,10 అనుచ్చేదాల అధికారాన్ని వినియోగించుకొని రూపొందించిన నియమాలు

1. ప్రాతినిధ్యాలు, విజ్ఞప్తులు, రాయబారాలకు సంబంధించిన నిర్ణయం కాక సబ్ కమిటీకి అధికారం ఉండును.

2. విద్యా మహాసభలు - విద్యాసదస్సులు, ప్రత్యక్ష చర్యలకు సంబంధించిన ప్రదర్శనలు రిలే నిరాహారదీక్షలు, ధర్నా, పికెటింగ్ వగైరా కార్యక్రమాలకు సంబందించిన నిర్ణయాలను కనీసం కార్యవర్గం ఆమోదంతో చేయవలెను.

3. సంఘపక్షాన న్యాయస్థానాలకు వెళ్ళవలసినపుడు సబ్-కమిటీ ఆమోదం పొందవలెను.

4. సెప్టెంబర్ 1వ తేదీ తరువాత కూడా ప్రాథమిక సభ్యులను చేర్చుకొనవచ్చును.అయితే ఈ సభ్యులు జిల్లా కౌన్సిలర్ల, రాష్ట్ర కౌన్సిలర్ల నిర్ధారింపునకు పరిగణింపబడరు. సభ్యత్వం పొడిగింపబడిన సందర్భంలో మాత్రం ఆ మేరకు చేర్పించిన సభ్యత్వం ఎన్నికలకు పరిగణింపబడును.

5. అర్హులైన వారిని సభ్యులుగా చేర్పించుటకు కనీసం మండల/పట్టణ/నగరశాఖల సబ్-కమిటీ మరియు ఆ శాఖల కార్యవర్గ సభ్యుల స్థాయికి తగ్గనివారై ఉండవలెను.

 6. సభ్యత్వం చేర్పించు చివరి తేదీ నుండి 10 రోజుల లోపల జిల్లాశాఖ/రాష్ట్ర సంఘకోటాల రుసుంను, సభ్యత్వ కౌంటర్ ఫాయిల్స్ ను, సభ్యుల జాబితాలు 3 ప్రతులను (సభ్యుల జాబితా రాష్ట్ర సంఘం నిర్ణయించిన నమూనా పత్రంలో ఉండాలి) మండల/ పట్టణ/నగరశాఖలు జిల్లాశాఖల ప్రధాన కార్యదర్శులకు పంపవలెను. వీటిని జిల్లాశాఖ సబ్-కమిటీ స్ర్కూట్నీ చేసి ధృవీకరించవలెను.

7. చివరి 15 రోజుల (సెప్టెంబర్ 25వ తేదీ) లోపల రాష్ట్రకోటా రుసుంను, జిల్లాశాఖ సబ్ కమిటీ స్కూట్నీ చేసిన సభ్యుల జాబితాల 3 ప్రతులను - సభ్యత్వ కౌంటర్ ఫాయిల్స్ను మండల/పట్టణ/నగరశాఖల వారీగా విజయవాడ రాష్ట్ర కార్యాలయానికి పంపవలెను. వీటిల్లో ఏవైనా లోటుపాట్లు రాష్ట్ర సబ్ కమిటీ పరిశీలనలో కనిపించితే వాటిని సరిదిద్ది, ఆమోదించిన సభ్యుల జాబితాల్లో తన వద్ద ఒక ప్రతిని ఉంచుకొని, మిగతా రెండు ప్రతులను రాష్ట్ర సంఘం జిల్లాశాఖకు పంపవలెను. ఈ రెంటిల్లో ఒక ప్రతిని జిల్లాశాఖ తన వద్ద ఉంచుకొని, మిగతా ప్రతిని మండల/పట్టణ/నగరశాఖకు పంపవలెను.

8. సభ్యత్వం రుసుంను మండల/పట్టణ/నగర శాఖలు నేరుగా రాసంఘానికి పంపరాదు. అవి జిల్లాశాఖ, రాష్టసంఘ కోటాల రుసుంను ఒకేసారి జిల్లాశాఖకు మాత్రమే సెప్టెంబరు 10వ తేదీ లోపల పంపవలెను.

9. ఎన్నికల జనరల్ కౌన్సిల్ ను ఫిబ్రవరి 28వ తేదీ లోపల జరుపవలెను.

10. ఎన్నికలనిర్వహణాధికారి రాప్రకౌన్సిలర జాబితాననుసరించి, సబ్ కమిటీకి, కార్యవర్గంలో

రిజర్వుడు స్థానాలకు, ఆడిట్ కమిటీ వగైరాలకు ఎన్నికలను నిర్వహించవలెను.

11. ఎన్నికల నిర్వహణాధికారిని, పరిశీలకుడుని సబ్ కమిటీ నిర్ణయించవలెను.

12. జిల్లాశాఖల ఎన్నికలను డిసెంబర్, జనవరి నెలల్లో రాష్ట్ర సబ్- కమిటీ నిర్వహించవలెను. అనివార్య పరిస్థితులలో వాయిదా వేయాలంటే రాష్ట్ర సంఘం అనుమతిని పొందవలెను.

13. నిర్ణయించిన తేదీకి ఎన్నికలు నిర్వహించబడని జిల్లాశాఖ రాష్ట్ర సంఘ ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హత కోల్పోవును.

14. జిల్లాశాఖ కౌన్సిలర్ల జాబితాను రాష్ట్ర సంఘం నిర్ణయించిన నమూనా పత్రంలో 3ప్రతులను జిల్లాశాఖ నిర్ణయించిన ఎన్నికల తేదీకి వారం రోజులు ముందుగా రాష్ట్ర సంఘ కార్యాలయానికి పంపి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆమోదం పొందవలెను. ఈ విధంగా ఆమోదం పొందిన జిల్లా  కౌన్సిలర్ల జాబితా మేరకే ఎన్నికల నిర్వహణాధికారి ఎన్నికలను నిర్వహించవలెను. జిల్లాశాఖల ఎన్నికల నిర్వహణాధికారిని, సహాయకుడిని రాష్ట్ర సబ్ - కమిటీ నిర్ణయించవలెను. 

15. మండల/పట్టణ/నగరశాఖల ఎన్నికలను అక్టోబర్ నుండి నవంబర్ లోపలనిర్వహించవలెను. ఈ శాఖల ఎన్నికల తేదీలను జిల్లాశాఖ సబ్ కమిటీ నిర్ణయించును. నిర్ణయించిన తేదీకి మండల/పట్టణ/నగరశాఖల ఎన్నికలను నిర్వహించవలెను. అనివార్య పరిస్థితులలో వాయిదా వేయవలసి వచ్చినపుడు జిల్లాశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల అనుమతి పొందవలెను. నిర్ణయించిన తేదీకి ఎన్నికలు నిర్వహించని మండల/పట్టణ/నగరశాఖ, జిల్లాశాఖ ఎన్నికల్లో పాల్గొనడానికి అర్హత కోల్పోవును.

16. మండల/పట్టణ/నగరశాఖల ఎన్నికలను జిల్లాశాఖ సబ్ కమిటీ నిర్ణయించిన ఎన్నికల నిర్వహణాధికారి నిర్వహించవలెను. జిల్లాశాఖచే స్ర్కూట్నీ చేయబడి, రాష్టసంఘం ఆమోదం పొందిన ప్రాథమిక సభ్యుల జాబితా మేరకే ఎన్నికల నిర్వహణాధికారి మండల/పట్టణ/నగరశాఖల ఎన్నికలను నిర్వహించవలెను.

17. అభ్యర్థి సంస్థ క్రమశిక్షణకు గురికాబడిన కాలంలో పోటీ చేయడానికి అనర్హుడు.

18. సభ్యులు కానివారు మరియు పదవీవిరమణ చేసినవారు పోటీ చేయడానికి అనర్హులు.

19. ఉపాధ్యాయ చందాదారులు కానివారు పోటీచేయడానికి అనర్హులు.

20. సంఘానికి బకాయి ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనరులు

21. సభ్యత్వం గడువులోపల సభ్యత్వం చేరనివారు ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులు.

22. ప్యానల్ నుగాని లేక అభ్యర్థినిగాని ప్రతిపాదించువారు, బలపరచువారు ఓటరై ఉండవలెను. నామినేషన్ల ప్రతిపాదనకు ఎన్నికల అధికారి 10 నిముషాలకు మించ కుండా తగు సమయమును నిర్ణయించవలెను. గడువులోపలవచ్చు నామినేషన్లనుఅభ్యర్థి గాని లేక ప్రతిపాదకులు-బలపర్చువారుగాని ఉపసంహరించుకొనుటకు సాధారణంగా 5నిముషాలకు మించకుండావ్యవధినిఇవ్వవలేను. ఎవ్వరైనా రాజీప్రయత్నాలకు కృషి జరిపినపుడు ఓటర్ల అభ్యర్థనపై 30 నిముషాలకు మించకుండా ఎన్నికల అధికారి వ్యవధిఇవ్వవచ్చును. అవసర సమయమును తగ్గించుటకును - పెంచుటకును ఎన్నికల అధికారికి హక్కుఉండును. వివాదాస్పద సందర్భములలో అప్పటికి ఎన్నికల అధికారి నిర్ణయమేతుదినిర్ణయం. ఎన్నికలఅధికారిపైనఎన్నికలఫిర్యాదునుఆపైశాఖకుచేయవచ్చును.

23. సబ్ కమిటీ సభ్యులకు, కార్యవర్గం (రిజర్వుడ్ స్థానాలతో సహా) సభ్యులకు, పై శాఖల జిల్లా/రాష్ట్ర కౌన్సిలర్లకు, ఆడిట్ కమిటీ సభ్యులకు విడివిడిగా ప్యానల్చును ప్రతిపాదించవచ్చును.

 

24. ప్రవేశపెట్టిన ప్యానల్ కు అభ్యంతరాలు లేనిపక్షంలో అభ్యర్థులందరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించవలెను. అభ్యంతరాలు ఉన్న సందర్భాలలో వరుసగా అధ్యక్షుడు,ప్రధానకార్యదర్శి, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఆడిట్ కమిటీ . నిర్వహించి ప్రకటించవలెను. జిల్లా మండల/పటణన. కౌన్సిలర్లను కూడా ఒకే ప్యానల్ జాబితాలోచేరి. అది వచ్చును. అభ్యంతరాలు ఉన్నచో పైన చెప్పిన వరుస క్రమస్థాయిల కౌన్సిలర్లును ఎన్నుకొనవచ్చును. 

25. ఎన్నికల అధికారి ఫెడరేషన్ ముద్ర గల తెల్ల కాగితాన్ని .ఉపయోగించాలి. బ్యాలెట్ పేపరును ఓటరుకు ఇచ్చే ముందు సంతకం చేసి ఇవ్వాలి. ఓటరు రహస్యంగా తనకిష్టమైన అభ్యరి పేరును గాని అభ్యరికి కేటాయించిన అంకేనుగాని బ్యాలెట్ పేపరు మీద వ్రాసి ఓటు చేయవచ్చును

26. ఎన్నికలు ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభించవలెను. కౌంటింగ్ సమయంలోఅభ్వరినిగాని, అతని ప్రతినిధినిగాని కౌంటింగ్ సరళిని పరిశీలించుటకు ఎన్నికల అధికారి అనుమతించవలెను. కౌంటింగ్ తరువాత ఫలితాలను ప్రకటించవలెను. ఎన్నికల ప్రకటన పత్రంపై ఎన్నికల అధికారి, పరిశీలకుడు సంతకాలు చేయవలెను. వాటిని సంబంధిత శాఖలకు అప్పగించవలెను. ఎన్నిక కాబడిన అభ్యర్థులచే ఫెడరేషన్ ఆశయాలకు, నియమాలకు లోబడి ఉపాధ్యాయ సంక్షేమానికి - విద్యారంగ ప్రగతికి పాటుపడతామని ప్రతిన చేయించవలెను.

 

                                                            ప్రతిజ్ఞ

“అంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్...(పదవికి) ఎన్నికైన నేను ఫెడరేషన్ నిబంధనావళికి, ఆశయాలకు, విధానాలకు కట్టుబడి విద్యాప్రగతికి, ఉపా ధ్యాయ సంక్షేమానికి శక్తివంచన లేకుండా నిష్పాక్షికంగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయుచున్నాను."

 

27.ఎన్నికల నిర్వహణలో నియమాలకుభిన్నంగా ఎన్నికలు జరిగినయెడల ఎన్నికల ఫిర్యా దును పైకమిటీకి 3 రోజులలోపు దాఖలుచేసుకోవచ్చును. సాధారణంగా ఆ ఫిర్యాదును అదిచేరిన తేదీ నుండి 15 రోజులలోపల సబ్ కమిటీ సమావేశమై ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై చర్చించి, నిర్ణయాన్ని గైకొనవలెను. విచారణ అవసరమగుచో సబ్ కమిటీ గాని లేదా దానిచే నియమించబడిన విచారణ కమిటీగాని ఫిర్యాదుదారు నుండి, ఎవ్వరి పైన ఫిర్యాదు చేయబడిందో వారి నుండి సంబంధిత రికార్డులు, వారిసంజాయిషీ మొదలగు వాటిని ఆహ్వానించి, పై కమిటీ తగు నిర్ణయం గైకొనవచ్చును.

28. పై శాఖలు ఇచ్చిన కార్యక్రమాలకు విరుద్ధంగా నడిచిన శాఖలను పై శాఖలుసంజాయిషీ కోరుతూనోటీసుఇవ్వవలెను. ఇచ్చిన సంజాయిషీని పై శాఖ చర్చించి తగు నిర్ణయం గైకొనవలెను. ఇచ్చినకార్యక్రమాలను ఉద్దేశ్యపూర్వకంగా అమలుపరచలేదని భావించినపుడు అభియోగాలు రూపొందించి,వాటిని సంజాయిషీ కోరవలెను. ఆ సంజాయిషీతో తృప్తి చెందనపుడు నిర్దిష్టమైన క్రమశిక్షణాచర్యలను సూచిస్తూ ఎందుకు ఆ క్రమశిక్షణా చర్యలు గైకొనరాదో సంజాయిషీ అడుగుతూ మెమోయివ్వవలెను. దీనిపైన వచ్చే సంజాయిషీ తృప్తికరమైన యెడల క్రమశిక్షణా చర్యలను గైకొనుటనుఉపసంహరించవలెను. తృప్తికరంకాని యెడల మెమోలో సూచించిన క్రమశిక్షణా చర్యలను గైకొనవలెను. ఈవిధానం సంఘఆశయాలను, కార్య క్రమాలను ఉద్దేశ్యపూర్వకంగా అమలుపరచని శాఖల బాధ్యులకు కూడా వర్తించును. క్రింది శాఖలు గైకొన్న క్రమశిక్షణా చర్యల పైన పై శాఖలకు అప్పీలు చేసుకొనవచ్చును.ఈఅప్పీలు 30రోజుల వ్యవధిలో చేసుకొనవలెను. అప్పీలు ముట్టిన 30 రోజులలోపల దానిపైశాఖ చర్చించి, అవసరమగుచో విచారణకమిటీని నియమించవచ్చును. ఈ కమిటీ 15రోజులలోపల విచారణ జరిపి, నివేదికను సబ్-కమిటీ దృష్టికి ఒక వారం రోజులలోపలతీసుకువెళ్ళవచ్చును. సబ్-కమిటీస్థాయికి తగ్గకుండా ఆనివేదికను పరిశీ లించి, ఆ కమిటీ తగిన నిర్ణయం గైకొనవలెను. ఆ అప్పీలు సరియైనది అయినచో స్వీకరించి, వారిపై గైకొన్న క్రమశిక్షణా చర్యలను రద్దుపరచవలేను. అప్పీలు సరియైనదికానిచో త్రోసిపుచ్చవచ్చును. 

29. క్రింది శాఖలు ప్రచురించు మ్యాగజైన్లు, న్యూస్లేటర్లు, కరపత్రాలు వగైరా ఫెడరేషన్విధానాలకు భిన్నమైనవిగా ఉండరాదు. భిన్నమైన విధానాల పైన, ఆశయాలపైన ప్రచురణలు చేసి, వాటిని చర్చా వేదికలుగా మార్చరాదు. అటువంటి చర్యలుక్రమశిక్షణా చర్యలుగా పరిగణింపబడును.

30. పై శాఖల నిర్ణయాలపైనగాని, కార్యక్రమాలపైనగాని విభేధించి తీర్మానాలు చేయరాదు.ఏ స్థాయిలో భిన్నాభిప్రాయం కలదో ఆ స్థాయి శాఖ సమావేశంలో మాత్రమే చర్చించు టకు గల అవకాశాన్ని వినియోగించుకొనవలెను. ఆ విధంగా చర్చించిన తరువాతమెజార్టీ నిర్ణయాలను క్రింది శాఖలు, బాధ్యులు అమలు జరుపవలెను.

31. ఫెడరేషన్ మరియు దాని శాఖలకు సంబంధించిన (ఉపాధ్యాయ, ప్రచురణలు వగైరా)ధనమును వేర్వేరు ఎకౌంట్ల క్రింద బ్యాంకుల్లో భద్రపరచవలెను. ఉపాధ్యాయ శాశ్వత చందాల ధనమును బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయవలెను. అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సమిష్టిగా బ్యాంక్ ఎకౌంటను ఆపరేట్ చేయుదురు. ఇదేవిధంగా జిల్లా,మండల/పట్టణ/నగరశాఖల స్థాయిలో కూడా చేయవలెను. 

32. రాష్ట్రస్థాయిలో అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఖర్చులకుగాను ఫెడరేషన్ నిధినుండిఒక్కొక్కరు వెయ్యి రూపాయలు వరకు ఉంచుకొనవచ్చును. ఉపాధ్యక్షులు, కార్యదర్శులు ఒక్కొక్కరు రు. 500/-ల వరకు ఉంచుకొనవచ్చును. జిల్లా శాఖ స్థాయిలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఖర్చులకుగాను ఫెడరేషన్ నిధి నుండి ఒక్కొక్కరు ఐదువందల రూపాయలు వరకు ఉంచుకొనవచ్చును. ఉపాధ్యక్షులు, కార్యదర్శులు రెండు వందల రూపాయలు వరకు వుంచుకొనవచ్చును. మండల/పట్టణ/నగరశాఖల స్థాయిలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఖర్చులకుగాను ఫెడరేషన్ నిధి నుండి ఒక్కొక్కరు ఏబది రూపాయల వరకు వుంచుకొనవచ్చును. ఉపాధ్యక్షులు, కార్యదర్శులు ఒక్కొక్కరుఇరువది ఐదు రూపాయల వరకు వుంచుకొనవచ్చును. 

33. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్, దాని జిల్లా - మండల/పట్టణ/నగరశాఖలచేఆర్జించబడిన స్థిరాస్తులు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కు చెందును. 

34. ఆస్తులను కొనుగోలు చేయునపుడు రాష్ట్ర స్థాయిలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్పేరున, దిగువశాఖల స్థాయిలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్.......శాఖ పేరున రిజిష్టర్ చేయించవలెను. 

35. దిగవ శాఖల ఆస్తుల కొనుగోలు పై శాఖల ఆమోదంతో జరుగవలెను.

36. ఏ కారణంతోనైనా క్రింది శాఖలు రద్దు కాబడినపుడు వాటి స్థిరచరాస్తులు ఆంధ్రప్రదేశ్టీచర్స్ ఫెడరేషన్ పై శాఖలకు చెందును. 

37. పీడన, అణిచివేత, అసమానతలకు వ్యతిరేకంగా సాగే. ఉద్యమాలను ప్రజాతంత్రఉద్యమాలుగా ఫెడరేషన్ గుర్తిస్తుంది.