Divider II by RBSRdesigns

                          తాజా సంచికల కోసం  బెల్లంకొండ మండల యూనిట్ ని సంప్రదించగలరు

          Divider I by RBSRdesigns

                  1948 నుండి 2008 వరకు గల  "ఉపాధ్యాయ " పత్రికలు 

            బెల్లంకొండ మండల యూనిట్ వద్ద మీకు సదా అందుబాటులో కలవు

         Divider I by RBSRdesigns

 

 

60 వసంతాల ఉపాధ్యాయ - పరామర్శ

 

(8-2-2008న వజోత్సవ విద్యామహాసభల్లో ఉద్యమ సదస్సుకు ప్రధానసంపాదకులు కె. భానుమూర్తి సమర్పించిన ఉపాధ్యాయ నివేదిక)

                1948 ఫిబ్రవరి నెల ఆంధ్రనాట ఉపాధ్యాయ ఉద్యమంలోను పత్రిక చరిత్రలోనూ ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. సరిగ్గా నేటికి 60 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన, ఈ రోజు వేలాది మంది ఉపాధ్యాయుల మధ్య వేడుకగా జరుగుతున్న ఈ వజోత్సవాలకు కారణభూతం. అదే 'ఉపాధ్యాయ' పత్రిక అవతరణ దినం. 1948 ఫిబ్రవరి 20 తేది.

                       ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఒకప్పటి నామధేయం ఆంధ్ర రాష్ట్ర ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్. అప్పటికింకా విశాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం జరగలేదు. ఆ మాటకొస్తే భారతదేశం ఇంకా బ్రిటీష్ జెండా కిందనే మగ్గుతుంది. దేశం అంతటా జాతీయ గీతాలాపనలు. క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత జరుగుతున్న ఉద్యమాలు చెరసాలలు, ఉరికొయ్యలు, తుపాకీగుళ్ళు, కరకు లాఠీదెబ్బలు హాహాకారాలు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. వారితోపాటు ఉద్యోగులు, కార్మికులు, చివరకు పోలీసులు, సైన్యం, నావికాదళం రైల్వే ఉద్యోగులు. తంతితపాల సిబ్బంది ఇలా అన్ని ఉద్యోగ వర్గాలు నిరసనాగ్రహెూగ్రజ్వాలలు వెదజల్లుతున్నవేళ. 1944 -ఏప్రిల్ 16-తూర్పుగోదావరిజిల్లా తాపేశ్వరం ఓ చారిత్రక సందర్భానికి వేదికయ్యింది. బడిపంతుళ్ళుగా దుర్భర బతుకువెతలు అనుభవిస్తున్న ముగ్గురు పురోగామి ఆలోచనాపరులు-తమ కడగండ్లు తీరడానికి సంఘస్థాపనే శరణ్యంగా భావించి ఆ కర్తవ్యానికి ఉద్యుక్తులయ్యారు. తొలుత జిల్లాస్థాయి సంఘంగానే అనుకొన్నప్పటికీ, పార్లమెంటు సభ్యులు ప్రముఖ కవి ఉమర్ అలిషా గారి సలహాతో అది రాష్ట్ర సంఘంగానే అవతరించింది. అదే రాష్ట్ర ప్రాథమికోపాధ్యాయ సంఘం.

ఆ తొలి సంఘటనకు చారిత్రక నేపథ్యం వుంది. ఆనాటికి సాగుతున్న జాతీయోద్యమ ప్రభావం ప్రజలలో అంతర్లీనంగా సాగుతున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాల భావన, పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిపట్ల అధికారుల చిన్నచూపు, ఈసడింపులు, చాలీచాలని జీతాలతో అల్లల్లాడుతున్న టీచర్ల కుటుంబాల కష్టాలు ఇవన్నీ ఒకెత్తు అయితే ఆనాటికే మలబారు ఉపాధ్యాయుల చారిత్రాత్మక సమ్మె. ఇవన్నీ నేపథ్యంగా 1944 ఏప్రిల్ 20న అవతరించింది. ఆంధ్ర రాష్ట్ర ప్రాథమికోపాధ్యాయ సంఘం. దీనిని స్థాపించిన ఆ ముగ్గురు పురోగామి శక్తులు మారెళ్ళపూడి పుత్రసత్యశర్మ, మాణిక్యాంబ, పి.బి. రామజోగారావు . ఆనాటి సంఘం చేసిన మహత్తర కార్యం ఏమిటంటే అప్పటికే చిన్న చిన్న సంఘాలు చెల్లాచెదరుగా వున్న తాలూకా స్థాయి బోర్డు స్థాయి సంఘాలను ఐక్యపర్చి ఒక విశాల రాష్ట్ర సంఘంగా ఏర్పాటు చేయడం. ఆంధ్ర నాట ఉపాధ్యాయ ఉద్యమం 'ఐక్యత' అనే స్ఫూర్తితో ప్రారంభం అయిందని గమనించాలి.

అయితే ఆనాటికే వునికిలో వున్న 416 జీ.వో.ను ధిక్కరించి ఏర్పాటు చేసిన ఈ రాష్ట్ర సంఘం పై బ్రిటీష్ పాలకులు సహజంగానే కన్నెర్ర చేశారు. తాఖీదులు జారీ చేశారు. బెదిరించి అదిరించి భయోత్పాతాన్ని సృష్టించారు. ఫలితంగా సంఘ కార్యక్రమాలకు తీవ్ర అడ్డంకులు ఏర్పడినాయి. దాదాపు స్తబ్దతకు లోనై కార్యక్రమాలు నిలిచిపోయాయి.కానీ ఉపాధ్యాయుల ఆలోచనలకు అడ్డు కట్టవెయ్యలేకపోయారు. వారి మదిలోని అసంతృప్తి జ్వాలలను ఆపలేకపోయారు. రాష్ట్రమంతటా అవి జ్వలిస్తూనే వున్నాయి. అలా రగిలే అగ్నికీలలే తర్వాత కాలంలో విద్యారంగంలో మౌలిక మార్పులకు, ఉపాధ్యాయుల జీవితాలలో ఆర్థిక ప్రతిపత్తికి, సామాజిక గౌరవానికి, నిరంకుశ, లంచగొండి అధికారుల ముచ్చెమటలకు కారణం అయ్యాయి. 

1947 ఏప్రిల్ 19, 20 తేదీలు గుంటూరు 

            అర్ధాంతరంగా నిలిచిపోయిన సంఘ కార్యక్రమాలు మళ్లీ కదలికలు రావడానికి తిరిగి రాష్ట్రంలోని అన్నిస్థాయి సంఘాలను ఐక్యతపర్చడానికి మరోమారు సమాయత్తం జరిగింది. ఈసారి వేదిక గుంటూరు'.

దేశంలోని అన్ని రకాల ప్రజా ఉద్యమాలకోసం, జాతీయోద్యమం తోను అలాగే చైతన్యవంతంగా సాగుతున్న వామపక్ష ఉద్యమాన్ని పరిశీలనగా చూసిన అనుభవం వున్న చెన్నుపాటి లక్ష్మయ్య గారు గుంటూరులో ఆంధ్ర రాష్ట్ర ప్రాథమికోపాధ్యాయ సంఘం యొక్క ద్వితీయ మహాసభను పూనుకొని తిరిగి సంఘాన్ని పునరుద్దరించే కార్యక్రమాన్ని చేపట్టారు. అన్ని వర్గాల ప్రజల నుండి విశేష సహకారం అంది వచ్చింది. మేథావుల సహకారం లభించింది. అలా 1947 ఏప్రిల్ 19, 20 తేదీలలో ఆంధ్ర రాష్ట్ర ప్రాథమికోపాధ్యాయ ఫెడరేషన్ పేరుతో నేటి ఏపిటిఎఫ్ తన తొలిప్రస్థానాన్ని ప్రారంభించింది. ఇది ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పూర్వరంగం.

సంస్థ ఏర్పడిన 10 నెలలకే తెలుగు అక్షరం గర్వపడే మరో అద్భుత ఆవిష్కరణ జరిగింది. అదే ఉపాధ్యాయ ఉ ద్యమ స్వరం 'ఉపాధ్యాయ' పత్రిక ఆవిష్కరణ. ఆంధ్ర రాష్ట్ర ప్రాథమికోపాధ్యాయ సంఘం తృతీయ మహాసభలు-వేదిక విజయవాడ పత్రిక ఏర్పాటు యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. ఉద్యమ అవసరాలు- ఆనాటి పరిస్థితులు పత్రిక ఏర్పాటుకు కారణాలైనాయి.

సంస్థ ఏర్పడిన వెంటనే చేపట్టిన మొదటి పోరాటం జీతాల పెంపుదలకోసం కృషి. అందులో భాగంగానే ప్రభుత్వానికి సమ్మె నోటీసు-సమ్మెకు సమాయత్తంగా సాగిన నగర సంకీర్తన, చలో అసెంబ్లీ. ఈ రెండు కార్యక్రమాలు ఊహించిన దానికంటే భారీగా విజయవంతం అయినాయి. వేలాది మంది ఉపాధ్యాయులు తమ జీవితాలు మెరుగుపడాలని, జీతభత్యాలు పెరగాలని ఆ సమాయత్త కార్యక్రమానికి వచ్చిన అనూహ్య స్పందన వల్ల ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితి అయ్యింది. జీతాల పెంపుదల నామమాత్రంగానే ఉన్నా అది ఉపాధ్యాయుల తొలి విజయం.

                         ఈ పోరాటాన్ని ఆనాటి అన్ని పత్రికలు విశేషంగా స్పందించాయి. కొన్ని పత్రికలు సంపాదకీయాలు రాసి సంఘీభావాన్ని ప్రకటించాయి. ఉపాధ్యాయుల విజయం వెనుక పత్రికలు అందించిన తోడ్పాటు ప్రశంసనీయం. అయితే సంస్థ ఏర్పడిన కొద్ది నెలలకే ఈ అపూర్వ విజయం ప్రభుత్వాలకు కంటగింపయ్యింది. పత్రికలపై లోపాయికారి ఒత్తిడులు పెరిగాయి. ఇదే సందర్భంగా సంఘంపై దాడులు, నిర్బంధాలు పెరిగాయి. ప్రభుత్వం పత్రికలపై తెచ్చిన ఒత్తిడి ఫలితంగా సంఘ కార్యక్రమాల ప్రచురణకు పత్రికలు ఆసక్తి కనిపించకపోయేసరికి, సంఘానికొక పత్రిక అవసరమన్న ఆలోచనకు ప్రేరణ కలిగింది. ఆ ఆలోచనే ఆచరణ రూపం దాల్చి ఉద్యమ కర్తవ్యాల కోసం ఉపాధ్యాయ' ఆవిర్భవించింది. అప్పటి నుండి యిప్పటి వరకు అదే ఉద్యమ కర్తవ్యాల కొరకు 'ఉపాధ్యాయ' అంకితమయ్యింది. అక్షరాలను ఉద్యమ బీజాలుగా ఉపాధ్యాయ లోకంలో వెదజల్లే కర్తవ్యాన్ని తన లక్ష్యంగా ఎంచుకొంది. ఒక ఆంగ్ల కవి మాటల్లో చెప్పాలంటే "అందమైన తెల్లకాగితాన్ని నల్లని అక్షరాలతో పాడుచేయదలిస్తే, ఆ అక్షరాలకు గొప్ప ప్రయోజనం ఉండి తీరాలి” అలా తన ప్రతి అక్షరం ఉద్యమ ప్రయోజనాల కోసం అర్పించి అరవై యేళ్ళుగా విద్యారంగ అభివృద్ది. ఉపాధ్యాయ సంక్షేమంకోసం "ఉపాధ్యాయ' కట్టుబడి వుంది.

                 1948 ఫిబ్రవరి ప్రారంభ సంచిక. మహాత్మాగాంధీ హత్యను ఖండిస్తూ, దానిని మతోన్మాదుల దురహంకార చర్యగా అభివర్ణిస్తూ భారతదేశ మత సామరస్యానికి ఒక హెచ్చరికగా ఆనాడే ప్రకటించింది. ఉపాధ్యాయుల కోర్కెల పరిష్కారానికి 'పోరాటాలే శరణ్యం' అన్న చెన్నుపాటి గారి వ్యాసం, కె.దామోదరయ్యగారి 'విద్యాశాఖాధికారుల నిరంకుశత్వం' పెద్ద ఉద్యోగులు, పెద్ద ఉద్యోగుల వివక్షతలు చూపే 'శ్రీరావు' వ్యాసం 'దేశ అవసరాలు భారత విద్యా ప్రణాళిక' అనే ఎస్.వి.నరసయ్య వ్యాసం 'నా ట్రాన్సఫర్' అనే గొట్టిపాటి నరసయ్య కథ ఇలా అన్ని రకాల విశేషాలతో తొలి సంచిక ఉపాధ్యాయ లోకంలోకి విడుదల అయ్యింది.

                   గ్రంథాలయోద్యమ పితామహుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కొమర్రాజు వినాయకరావు, శ్రీమతి వల్లభనేని సీతామహాలక్ష్మి (ఎం.ఎల్.ఏ.), వి.రాముణ్ణి (కార్యదర్శి, మద్రాసు రాష్ట్ర ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్ ఫెడరేషన్). అలాగే నందివెలుగు వెంకటేశ్వర శర్మ, నిడుమోలు వెంకట సుబ్బారావు, డి. చినసుబ్బయ్య మొదలైనవారి రచనలు ఈ ప్రథమ సంచికలో ప్రచురించారు. 

                           అది మొదలు 'ఉపాధ్యాయ' సంస్థ ప్రకటిత లక్ష్యాల ప్రచారానికి, ఉపాధ్యాయులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడానికి, సంస్థ సాగించే ప్రతి కార్యక్రమాన్ని ఉపాధ్యాయుల మధ్యకు తీసుకొని వెళ్ళడానికి, ఉపాధ్యాయు లలో వృత్తి నిబద్ధతను, బోధనా ప్రక్రియలను పెంపొదించడానికి తన ప్రతి సంచికను అంకితం చేసుకుంది. ప్రారంభ సంచిక నుండే సాహిత్యానికి ప్రత్యేక స్థానాన్ని కేటాయించిన పత్రిక. నేటి వరకు అదే ఒరవడి కొనసాగిస్తూ వస్తోంది. సహజంగా సాహితీ అభిమానులుగా వుండే ఉపాధ్యాయులలో మరింత సాహిత్యాభినివేశం కలిగించడానికి ఉపాధ్యాయ విశేష కృషిచేస్తూ వస్తోంది. ఈ పత్రికకు ఎందరో ప్రముఖులు తమ రచనలు అందించి సహకరించారు. ఈ పత్రిక ద్వారా రచయితలుగా పరిచయం అయి తదనంతర కాలంలో ప్రముఖులుగా పేరొందినవారు వున్నారు. ఇది పత్రికకే గర్వకారణం.

వేతనోద్యమం

                    ఉపాధ్యాయుల జీతాలు అతిదిగువ స్థాయిలో వుండి, సమాజంచే ఈసడింపులకు గురయ్యే విధంగా వుండేవి. బహుశా 'బతకలేని బడిపంతులు' అనే మాట ఒక జాతీయంగా స్థిరపడడానికి ఇదే కారణం కావచ్చు. చాలీచాలని జీతాలు, తీవ్రమైన ఇబ్బందులు -వీటన్నింటినీ అధిగమించడమే ఫెడరేషన్ తొలి లక్ష్యం. అందుకనుగుణంగానే సంస్థతొలి సమరశంఖారావం వల్ల ఉపాధ్యాయుల నామమాత్రపు జీతాల పెంపుదల. అయితే ఆనాటి సంస్థ యొక్క బాలారిష్ట దశలవల్ల వాటితో సంతృప్తిపడినా తిరిగి 10 సంవత్సరాలు తర్వాత వేతనోద్య మానికి పూనుకొంది. ఈ మధ్యకాలంలో ఉపాధ్యాయుల జీతాలను గురించి, వారికి న్యాయంగా రావలసిన స్కేళ్ళ గురించి అనేక వ్యాసాలు ‘ఉపాధ్యాయ'లో ప్రచురించటం జరిగింది. సదస్సులలో జరిగే తీర్మానాలు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు యిచ్చే మెమోరాండాలు, ఇతర దేశాలలోని ఉపాధ్యాయుల జీతాలు, ఇలా అనేక రకాలైన అంశాలను ఉపాధ్యాయ'లో ప్రచురించి ఉపాధ్యాయులను చైతన్యవంతుల్ని చేసింది. తమకి న్యాయంగా రావలసిన జీతాలను ఉపాధ్యాయుల చేత గుర్తింపజేయడంలో ఉపాధ్యాయ కృతకృత్యురాలైంది. ఉపాధ్యాయుల డిమాండ్ల పట్ల కొందరు సానుభూతివున్న మంత్రులు చేసిన సంఘీభావ ప్రకటనలను ఉపాధ్యాయ'లో ప్రచురించి, మరికొందరు ఉపాధ్యాయుల జీతాల గురించి తేలికగా మాట్లాడిన వాళ్ళ వ్యాఖ్యానాలను గూడా ప్రచురించి, ఉపాధ్యాయులను ఉద్యమ కర్తవ్యోన్ముఖులను గావించడంలో 'ఉపాధ్యాయ' కృతకృత్యురాలైంది. ఈ పదేళ్ళ కాలంలో దేశంలో పెరిగిన ధరలు, జీవనవ్యయం, కుప్పుస్వామి కమిటీలోని ఉపాధ్యాయుల జీతాలు పెంచాలని సిఫార్సు వీటన్నింటినీ పత్రిక విశేషంగా ప్రాచుర్యాన్ని తీసుకొని రాగలిగింది.

                       ఈ పరిస్థితులలో ఫెడరేషన్ పిలుపు మేరకు సాగిన ఆందోళనవారం. ఉపవాసదీక్ష, విచారవారం మొదలైన కార్యక్రమాలు నూటికి నూరుశాతం విజయవంతం కావడం వెనుక పదేళ్ళుగా 'ఉపాధ్యాయ' పత్రిక చేసిన కృషి ఉ న్నది. ఆ విధంగా ఉపాధ్యాయుల వేతనాలలో గణనీయమైన పెరుగుదలకు, వేతన సవరణల్లో డి.ఏ. విలీనం జరగడానికి, ‘ఉపాధ్యాయ ' చేసిన విస్తృతమైన ప్రచారం తోడ్పడింది అని చెప్పాలి.

‘ఫెడరేషన్ చారిత్రక ఘట్టం-శభాష్ కనిగిరి'

                        కనిగిరిలో జరిగిన ప్రాథమికోపాధ్యాయ మహాసభలో ఆనాటి నాయకురాలు మాణిక్యాంబ చూపిన నాయకత్వ ప్రతిభ ఫెడరేషన్ కు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టింది. నేటికీ ఆ చారిత్రక ఘట్టం విన్నా చదివినా నేటి తరానికి రోమాంచితం కాక మానదు. ఆ సభలో సాక్షాత్తు జిల్లా విద్యాశాఖాధికారి సమక్షంలో మాణిక్యాంబ గారు చేసిన అనర్గళ ప్రసంగం, దానిని అడ్డుకోజూసిన డి.ఇ.ఓ.గారికి జరిగిన భంగపాటు, ఆనాటి సభలో పాల్గొన్న ఉపాధ్యాయులు సంఘంపట్ల చూపిన అచంచల విశ్వాసం ఇవన్నీ ఫెడరేషన్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అపూర్వ ఘట్టాలే. అయితే ఈ సంఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న సింగరాజు రామకృష్ణయ్య ఈ సంఘటనను యథాతథంగా, అక్షరం పొల్లుపోకుండా ఎక్కడా అతిశయోక్తులకు తావీయకుండా మే నెల 'ఉపాధ్యాయ' (1948)లో “ప్రేక్షకుడు' పేరుతో ముద్రించి విశేష ప్రాచుర్యాన్ని కలిగించారు. రాష్ట్రమంతటా ఈ వార్త 'ఉపాధ్యాయ' ద్వారా ప్రాకింది. చదివిన అందరు ఉపాధ్యాయులకు ఫెడరేషన్ పట్ల అపార విశ్వాసం ఏర్పడ్డాయి. నిరంకుశ అధికారులను ఎదిరించాలంటే ఖచ్చితంగా సంఘం తోడ్పాటు అవసరం అనేలా గుర్తింపజేసింది. ఉపాధ్యాయుల్లో కొత్త ఉత్సాహం, నిరంకుశ అధికారులకు గుండె బెదురు కల్గించడంలో ఆనాటి 'ఉపాధ్యాయ' పాత్ర మరువరానిది. తదనంతరం జిల్లా శాఖాధికారి సింగరాజుగారిని ఎవరీ ప్రేక్షకుడు' అని ఆరా తీయడం, దానికి సింగరాజు సున్నితంగా తిరస్కరిస్తూ 'మీరు తెలుసుకోవాలంటే కోర్టు నాశ్రయించండి' అక్కడ రచయితను ప్రవేశపెడతాం' అని ధీటుగా సమయోచితంగా జవాబివ్వడం తదనంతర పరిణామాలు-మొత్తానికి కనిగిరీ సంఘటనను 'ఉపాధ్యాయ' పత్రిక ఫోకస్ చేసినతీరు అటు ఉపాధ్యాయులలో బోలెడంత ఆత్మవిశ్వాసాన్ని నింపడమేకాక ఆనాటి నిరంకుశ, లంచగొండి అధికారుల అహంకారాన్ని చావుదెబ్బతీసి ఉపాధ్యాయలోకంలో 'శభాష్ కనిగిరి'గా చిరకాలం మిగిలి వుండేలా చేసింది.

పాలకులు మనవారే అయినా వారు అవలంబిస్తున్న నిర్బంధ విధానాలు అత్యంత అప్రజాస్వామికంగా వుండటం చేత వీటన్నింటినీ పరిశీలించడానికి, ఆస్ట్రేలియా దేశ యూనివర్శిటీ ప్రొఫెసర్ రాబిన్ గొల్లాన్ టీచర్స్ యూనియన్ యొక్క ప్రపంచ సమాఖ్య తరఫున ఇండియాలోని విద్యా విధానాన్ని పరిశీలించడానికి పూర్తి అధికార పత్రాలతో వచ్చిన సందర్భంలో బొంబాయిలో దిగిన అతణ్ని తిరిగి అదే విమానంలో పంపివేయడం ఆనాటి దేశ నిర్బంధ విధానాన్ని బట్టబయలు చేస్తుంది. అతను తిరిగి సింగపూర్ చేరి అక్కడ నుండి సింగరాజు రామకృష్ణయ్య గారికి ఆవేదనతో రాసిన ఉత్తరాన్ని 'ఉపాధ్యాయ'లో ప్రచురితం చేసి, ఆనాటి భారతదేశ పాలకులు కొనసాగిస్తున్న నిర్బంధ విధానాన్ని ప్రపంచానికి బహిర్గతం చేయడమేకాక, ఆ విషయం పై పదునైన సంపాదకీయాన్ని 1951 మార్చి నెల 'ఉపాధ్యాయ'లో వ్రాసింది. అంతేకాక సంఘస్థాపనా హక్కుకు సంబంధించి 416 జీ.వో.ను ధిక్కరించి సంఘం పెట్టడం నేరమనే డైరెక్టరుగారి ఉత్తర్వులు సవాలుచేస్తూ సింగరాజు గారు మద్రాసు హైకోర్టులో వేసిన వ్యాజ్యాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తేవడానికి ఉపాధ్యాయ పత్రిక విశేష కృషిచేసి విజయం సాధించింది. ఆంధ్ర రాష్ట్ర ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్లో సభ్యునిగా వుండరాదని, 'ఉపాధ్యాయ' పత్రిక ప్రచురణలో పాలుపంచుకోరాదని, అలా జరిగితే క్రమశిక్షణాచర్యలు తీసుకోగలమని హెచ్చరిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వెనక్కి తీసుకొనేలా ఆదేశించాలని కోర్టును ఆశ్రయించిన వైనాన్ని 1950 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల ఒకే సంచికగా వెలువడిన పత్రికలో వ్యాస రూపంలో వెలువడింది.

                   సంఘ స్వాతంత్ర్యానికి అడ్డంకిగా వున్న 416 జీ.వో. పట్ల సంఘం తీసుకొంటున్న న్యాయపరమైన చర్యలు అన్నీ ఉపాధ్యాయ లోకానికి వెల్లడించడం ఆనాటి 'ఉపాధ్యాయ' పత్రిక వ్యాసం దోహదపడింది. తదనంతరం వచ్చిన సంచికలలో కోర్టులో వున్న ఈ వ్యాజ్యానికి సంబంధించిన వార్తలను ప్రచురిస్తూ ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులకు విషయాలను అందించడంలో పత్రిక కృతకృత్యురాలైంది. ఇక అంతిమంగా కోర్టులో సంఘ స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తూ మద్రాసు హైకోర్టు వెలువరించిన తీర్పును విశేష అంశంగా పత్రికలో ప్రచురిస్తూ 1951 (అక్టోబరు, నవంబర్) సంచికలో 'ఆంధ్ర ప్రాథమికోపాధ్యాయుల అఖండ విజయం' పేరుతో చెన్నుపాటి లక్ష్మయ్య గారు రాసిన వ్యాసం ఆంధ్ర ఉపాధ్యాయులకు చేరవేసి, వారి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచడంలో పత్రిక దోహదకారి అయ్యింది. 'టీచర్స్ ఆఫ్ ది వరల్డ్' (వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్ యూనియన్స్చే ప్రచురింపబడే ఆంగ్ల పత్రిక) తొలి సంచికలో మన కోర్టు ప్రాతినిధ్యాన్ని, రెండవ సంచికలో మన విజయాన్ని ప్రచురించిన విశేషాన్ని కూడా అక్టోబరు 52 ఉపాధ్యాయ'లో ప్రచురించి ఆంధ్ర నాట ఉపాధ్యాయ లోకాన్ని ఉత్తేజితులు గావించడంలో పత్రిక విజయం సాధించింది. అంతే పౌరప్రజాస్వామ్య హక్కులను పరిరక్షిస్తూ కోర్టులుగానీ, ప్రభుత్వాలుగానీ వెలువరించే ప్రతి ఉత్తర్వులను 'ఉపాధ్యాయ'లో స్థానం కల్పిస్తూ -ఆనాటి నిర్బంధ పరిస్థితుల నుండి ఉపాధ్యాయులను ధైర్యంచేసే ఏ ఒక్క అవకాశాన్ని జారవిడవక 'ఉపాధ్యాయ'లో ప్రచురిస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే నిర్బంధ జీ.వో.2775 రద్దు అయిన సందర్భంలో ఆ అంశాన్ని ఉపాధ్యాయ డిసెంబరు 52లో ప్రచురిస్తూ ఆ ఉత్తర్వుల సారాన్ని విపులీకరిస్తూ వ్యాసాన్ని వెలువరించింది. “యికపై ఏ ఉపాధ్యాయ యూనియన్ ని రికగ్నైజు చేయాల్సిన అవసరం లేదని, ఇంతకు పూర్వం జిల్లా, తాలూకా టీచర్ల యూనియన్లకున్న రికగ్నిషన్ రద్దు చేయబడిందని కాండక్టు రూల్సుచే బంధింపబడు జిల్లా బోర్డు, మున్సిపల్ టీచర్లు కూడా రికగ్నిషన్ లేని యూనియన్లలో చేరవచ్చని' ఆ ఉత్తర్వుల సారాన్ని ఉ పాధ్యాయ' పత్రికలో ప్రాథమికోపాధ్యాయులకు మరొక విజయం పేరుతో ప్రచురితం అయ్యింది. ఈ వార్తతో అంత వరకు ఫెడరేషన్లో చేరాలంటే కొంత తడబడే ఉపాధ్యాయులు ఫెడరేషన్ పట్ల ఆసక్తిచూపడానికి అవకాశం ఏర్పడింది. |

           1956 నుండి 59 వరకు సాగిన స్కూళ్ళ జాతీయకరణ కొరకు ఉపాధ్యాయ తన వంతు కృషి సల్పింది. వివిధ మేనేజిమెంట్లులోని విభిన్న పరిస్థితులలోనున్న ఉపాధ్యాయులను ఐక్యపర్చి ఒకే వ్యవస్థలోనికి తీసుకొని రావడానికి సాగిన ఉద్యమానికి 'ఉపాధ్యాయ' తన కర్తవ్యాన్ని అందించింది. | ఫెడరేషన్ సాధించిన మరో గొప్ప విజయం కో ఆర్డినేషన్ సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం ఉపాధ్యాయులకు అధికారవర్గానికి మధ్య వుండే గ్యాప్ పూరించాలంటే వారి సమస్యల పరిష్కారానికి వీరి మధ్య తరచు సమావేశాలు జరగాలనే ప్రాతిపదికన, ప్రభుత్వంపై ఉద్యమాల ద్వారా ఒత్తిడి తీసుకొని వచ్చి, దీనికోసం ప్రత్యేకంగా రెండు రోజులు నిరాహారదీక్షలు చేసి ఈ విజయాన్ని సాధించుకోవడం జరిగింది. దీనిని 'ఉపాధ్యాయ' పత్రిక సొంతం చేసుకొని ప్రతి కార్యక్రమాన్ని పత్రికలో ప్రచురించి సమస్య పరిష్కారానికి మార్గం చూపింది. ఫలితంగా 1972లో కోఆర్డినేషన్ సమావేశాల ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది.

 ఫెడరేషన్ ఆటుపోట్లు-ఉపాధ్యాయ నైతిక మద్దతు 

       ఫెడరేషన్ తన సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. అధికారుల నిరంకుశ విధానాల వల్ల ఏర్పడిన నిర్బంధాలు-కమ్యూనిస్టు సంస్థ అని ముద్రవేసి ఉపాధ్యాయుల నుండి వేరుచేయాలని దుష్ప్రచారాలు. ఆర్థిక యిబ్బందులు-చీలికలు ఇలా జీవితకాలంలో అనేక కష్టాలు, కడగండ్లను ఫెడరేషన్ చవి చూసింది. ఇవన్నీ ఉ పాధ్యాయ' పత్రికకు తప్పలేదు. అయినా మొక్కవోని ధైర్యంతో సంస్థ ముందుకు సాగిపోతుంటే సంస్థకు ఆత్మసైర్యాన్ని యిస్తూ ఉపాధ్యాయ కూడా ముందుకు సాగిపోతూ, ప్రతి కుట్రను, దుష్ప్రచారాన్ని పదునైన వ్యాసాలతో, అర్థవంతమైన సంపాదకీయాలతో ఉపాధ్యాయులను, పాఠకుల్నీ చైతన్యవంతుల్ని చేయడమేకాక నిష్పాక్షికమైన నిజాన్ని బాహ్య ప్రపంచానికి వ్యక్తం చేయడంలో అత్యంత నిజాయితీ ప్రదర్శించింది. అధికారుల నిరంకుశ విధానాలను, వారి అహంకార పూరిత చర్యలను ధైర్యంగా 'ఉపాధ్యాయ' ఎదుర్కొంది. వారి అసలు స్వరూపాన్ని బట్టబయలు చేస్తూ వ్యాసాలు, రిపోర్టులు ప్రచురించింది. అవి చదివిన ఉపాధ్యాయులు నూతనోత్సాహాలతో సంఘంపట్ల అభిమానం పెంచు కొంటుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు ఫెడరేషన్ పైనా, పత్రికపైనా అక్కసు వెళ్ళగక్కేవారు. వాటిని కూడా పత్రిక బహుముఖంగా ప్రచురించేది. మీ సంస్థ కమ్యూనిస్టు సంస్థ, మీ పత్రిక కమ్యూనిస్టు పత్రిక అని ప్రభుత్వం ప్రచారాన్ని పత్రిక ద్వారా, సంపాదకీయాల ద్వారా, రచనల ద్వారా త్రిప్పికొట్టడమేగాక ఫెడరేషన్ తన ఋజువర్తనాన్ని నిరూపించుకోడానికి సంస్థ నిర్దిష్టమైన విధాన పత్రం రూపొందించుకొని తనేమిటో తన విధానమేమిటో ప్రకటించింది.ఈ విధానం యొక్క తాత్విక లక్షణాలను 'ఉపాధ్యాయ' పత్రికలో వివిధ వ్యాసాల రూపంలో ప్రచురించింది. “ఉపాధ్యాయులు-రాజకీయాలు” మొదలైన సైద్ధాంతిక విశ్లేషణలను ప్రచురించటం ద్వారా ఉపాధ్యాయులను చైతన్యపర్చింది. ఫెడరేషన్ విధానాన్ని పత్రిక ద్వారా దుష్ర్పచారులకు తెలియపర్చింది. తదనంతరం ఫెడరేషన్ కు వ్యతిరేకంగా చేసిన దుష్ప్రచారానికి మూతలుపడ్డాయి. .  

                   చీలికలు జరిగిన ప్రతిసారీ సంస్థపైన జరిగిన దాడిని పత్రిక ద్వారా త్రిప్పికొట్టడంలో ఉపాధ్యాయ గొప్ప పరిణతి ప్రదర్శించింది. 1968, 1976, 1987, 1999 ఇలా చీలిక చోటుచేసుకున్న ప్రతి సందర్భంలోనూ పత్రిక ద్వారా చీలికవాదుల పన్నాగాలను బహిర్గతం చేసి మాతృసంస్థ ప్రతిష్టను నిలబెట్టడంలో ఉపాధ్యాయ' విజయం సాధించింది.

ఐక్య ఉద్యమం-ఫెడరేషన్- ఉపాధ్యాయ’

              ఉపాధ్యాయ ఫెడరేషన్ రూపుదిద్దుకోవడమే ఐక్యత అనే విశాల ప్రాతిపదికన జరిగింది. ఆ ఐక్యతనే తన జీవిత కాలమంతా నిలబెట్టుకొంటూవస్తుంది. ఉపాధ్యాయ ఉద్యమంలో వచ్చిన పెడధోరణుల వల్ల ఉద్యమం చీలిన తర్వాత సమస్యల పరిష్కారానికి ఐక్యపోరాటాలే శరణ్యమని భావించి ఐక్యతా ప్రయత్నాలు మొదలు పెట్టింది ఫెడరేషన్. దీనికి 'ఉపాధ్యాయ' పత్రిక ప్రాధాన్యాన్ని యిస్తూ ఐక్యస్పూర్తిని రేకెత్తించే విధంగా అనేక సంపాదకీయాలను పత్రికలో ప్రచురించింది. అంతేకాదు ఐక్య ఉద్యమం యొక్క ప్రతి పోరాట కార్యక్రమానికి ఐక్య ఉద్యమ బ్యానర్ పైనే ఉపాధ్యాయ లోకంలో ప్రచారం చేసింది. ఫలితాలను కూడా ఐక్య ఉద్యమం కృషిగానే భావించి అదే విషయాలను ఉపాధ్యాయ లోకానికి అందించేది. ఎక్కడా ఎటువంటి ఆధిపత్య ధోరణులను, భేషజాలకు వీసమెత్తు అవకాశాన్ని కల్పించకుండా, గొప్ప హుందాతనాన్ని ప్రదర్శించడంలో 'ఉపాధ్యాయ' పత్రిక తన ప్రత్యేకతను చాటుకుంది. కొన్ని సంఘాలు ఐక్యతకు భిన్నంగా వ్యవహరించినా తాను మాత్రం ఎక్కడా ఐక్యతా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించక గొప్ప ఔన్నత్యాన్ని ప్రదర్శించింది. శాసనమండలి -ఫెడరేషన్-ఉపాధ్యాయ'

ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి ఏర్పాటు సందర్భంలోనే “ఉపాధ్యాయులకు డబ్బులు లేవంటూ కౌన్సిల్ నిర్మాణమా?” అని ప్రశ్నిస్తూ గుంటూరుశాఖ చేసిన తీర్మానాన్ని ఉపాధ్యాయలో ప్రచురించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఫెడరేషన్ అభ్యర్థులు గెలుపొంది శాసనమండలిలో తమ ఉద్యమవాణిని బలంగా వినిపించారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై మన ఎం. ఎల్.సి.లు చేసిన ప్రసంగాలను క్రమం తప్పక 'ఉపాధ్యాయ' పత్రిక ప్రచురిస్తూ మన దృక్పథాన్ని ఉపాధ్యాయ లోకానికి విశదపర్చడంలో ఉపాధ్యాయ' పత్రిక విజయం సాధించింది.

ముఖ్యంగా మద్రాసు శాసనమండలిలో రాజాజీ ప్రభుత్వం 'మోడి ఫైడ్ ఎడ్యుకేషన్ స్కీం' పేరుతో ప్రవేశపెట్టిన బిల్లును ఓడించడం. దానిని 1953 మే నెల సంచికలో “ప్రయోజన రహితమైన ప్రణాళిక” పేరుతో సంపాదకీయం ప్రచురించి తన నిరసనను వెళ్ళబుచ్చింది. అదొక్కటే కాదు. మన ఎం.ఎల్.సి.ల పర్యటనలను, వారు యిచ్చే విజ్ఞాపనలను, వారి ప్రసంగాలను 'ఉపాధ్యాయ' పత్రిక ప్రముఖంగా ప్రచురిస్తూ శాసనమండలిలో ఉద్యమవాణిని ఉ పాధ్యాయులకు చేరవేయడంలో పత్రిక ప్రముఖ పాత్ర పోషించింది. సాహిత్యం-ఉపాధ్యాయ’

తొలి నుంచి ఉపాధ్యాయ పత్రిక సాహిత్యానికి ప్రముఖ స్థానాన్ని కేటాయించింది. ప్రముఖులెందరో ఈ పత్రికలో తమ రచనలు ఇచ్చి పత్రికను గౌరవించారు. అదే విధంగా ఈ పత్రిక ద్వారా రచయితలుగా పరిచయం అయినవారు తదనంతర కాలంలో ప్రముఖ రచయితలుగా వర్ధిల్లినారు.

                          సాహితీవేత్తలు మరణించినపుడు వారి సాహితీ సృజనను అవలోకనం చేస్తూ 'ఉపాధ్యాయ' సంపాదకీయాలు రాసింది. కొన్ని ముఖచిత్రాలపై సాహితీ ప్రముఖులచిత్రాలను ముద్రించి సాహిత్యరంగంపట్ల తన నిబద్దతను చాటుకుంది 'ఉపాధ్యాయ’ పుట్టపర్తి నారాయణాచార్యులు రచన ‘విజయనగర సామ్రాజ్యం' అనే రచనను సీరియల్గా ప్రచురించింది. నవ్యాంధ్ర సారస్వత స్రవంతి పేరుతో, ప్రసిద్ధులైన రచయితల కావ్య అనుసృజనను గావించి ‘ఉపాధ్యాయ'లో ప్రచురించింది. అడవి బాపిరాజు, డా|| కట్టమంచి రామలింగారెడ్డి, దువ్వూరి రామిరెడ్డి, చిలకమర్తి, గురజాడ, శ్రీశ్రీ, నండూరి సుబ్బారావు వంటి ప్రముఖుల సాహిత్య సమీక్షను నాదమునిరాజుగారు 'ఉపాధ్యాయ' పత్రికలో గావించారు. ప్రతి నెల క్రమం తప్పక 1957 పత్రికలలో ఈ వ్యాస పరంపర అచ్చయ్యింది.

సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించే కార్యక్రమంలో ఉపాధ్యాయ' ఏమీ తీసిపోలేదు. గోర్కీ లూషన్ కథలతోపాటు చైనా, రష్యా సాహితీవేత్తల అనువాదాలు 'ఉపాధ్యాయ'లో ప్రచురితం అయినాయి. మాయాబజార్, పుట్టిల్లు వంటి సినిమాసమీక్షలు కూడా 'ఉపాధ్యాయ'కు నిండుదనాన్ని ఇచ్చాయి. అంతేకాదు. పౌరహక్కులకు భంగం కలిగినా, విప్లవ రచయితల్ని నిర్బంధించినా వాటిని ఖండిస్తూ చేసిన తీర్మానాలు ఉపాధ్యాయ'లో ప్రచురించి ప్రజాస్వామ్య విధానాలకు ఊపిరులు పోసింది 'ఉపాధ్యాయ'. పదునైన సంపాదకీయాలు'ఉపాధ్యాయ' ప్రారంభ సంచికలో ఎం.కె.గాంధీ గారి హత్యను ఖండిస్తూ సంపాదకీయాన్ని రాసింది. అది మొదలు 'ఉపాధ్యాయ' సంపాదకీయాలు సూటిగా, వాడిగా సమస్యల్ని ప్రస్తావించి వాటి లోతును విశ్లేషణాత్మకంగా వివరిస్తూ వస్తున్నాయి. ప్రముఖులు మరణించినపుడు సందర్భానుసారంగాస్పందిస్తూ, ఉద్యమాలు జరుగుతున్నపుడు ఉత్తేజకరంగా స్పందిస్తూ విద్యా విధానాలు లోపాలను సూటిగా అంతేకాదు ప్రసిద్ద సాహితీ విమర్శకుడు రా.రా.గా ప్రసిద్దుడు అయినా రాచమల్లు రామచంద్రారెడ్డిగారు కొన్ని మంచి కథలు కూడా రాశారు. వారి కొద్ది కథలలో అతి మంచి కథ 'అలసిన గుండెలు, ఉపాధ్యాయ'లో అచ్చయ్యింది. అలాగే జంపన పెద్దిరాజు గారి ప్రసిద్ధ కథ 'ఫౌల్ ఫౌల్' కూడా 'ఉపాధ్యాయ'లో పునర్ముద్రితం అయ్యింది. ఇక భూషణం, ఎల్. ఎల్. సుదర్శనం, సోమసుందర్ వంటి ప్రముఖులు తమ కథలు, వ్యంగ్య రచనలు, నాటికలతో 'ఉ పాధ్యాయకు సాహిత్యంతో సంబంధాన్ని గాఢతరం చేసారు. కె.శివారెడ్డి, చైతన్యకుమార్, సమతారావు గారు తమ గేయాలతో, కవితలతో బాలసాహిత్యంతో 'ఉపాధ్యాయ'కు కొత్త అందాన్నే అద్దారు. “నేడు కావలసిన బాల సాహిత్యం” పేరుతో సమతారావు గారు 'ఉపాధ్యాయ'కు వ్యాస పరంపర అందించారు. కొడవటిగంటి వారి తాత్విక వ్యాసాలు కూడా 'ఉపాధ్యాయ'లో ప్రచురించబడినాయి. ఇలా 'ఉపాధ్యాయ' తొలి సంచిక నుండీ సాహిత్యానికి పెద్దపీట వేస్తూ వచ్చింది. మంత్రులు ఉపాధ్యాయుల్ని కించపరిచే వాఖ్యలు చేసిన సందర్భంగా వారిని సున్నితంగా హెచ్చరిస్తూ వ్రాసిన సంపాదకీయాలు, ప్రముఖులు మరణించినపుడు వారి జీవితాన్ని విశ్లేషిస్తూ వ్రాసిన సంపాదకీయాలు, మారాల్సిన ప్రభుత్వ విధానాలను గూర్చి సున్నిత వ్యాఖ్యలు, నిర్బంధాలు ఎదురైనపుడు పదునైన వ్యాఖ్యానాలు, చాలీచాలని వేతన స్థితిని వివరించే విశ్లేషణాత్మక సంపాదకీయాలు, నిరుద్యోగంపైన, అధిక ధరల పైన, లంచగొండితనంపైన ఇలా సందర్భోచితమైన సంపాదకీయాల్ని 'ఉపాధ్యాయ' ప్రచురించింది. అదే విధంగా ఆర్థిక అసమానతలపైన, ప్రపంచీకరణ, ప్రయివేటు కార్పొరేటు విద్యా విధానం పైన, బాలల హక్కుల గురించి, రైతుల, చేనేత కార్మికుల వెతల గూర్చి ఇలా అన్ని పార్వాలను తడుముతూ సంపాదకీయాలు వెలువడినాయి. రాబిన్ గొల్లాన్ ను మన దేశంలోకి అనుమతి నిరాకరించినపుడు “తలవంపులు కాదా” అనే సంపాదకీయంతో మన నిర్బంధాలను ఎత్తిచూపింది. అలాగే సంఘ విచ్చిన్నతకు పాల్పడిన వారినుద్దేశించి అర్థవంతమైన సంపాదకీయాల్ని ప్రచురించి వాస్తవాన్ని విశ్లేషించింది. వీటితోపాటు చెన్నుపాటి, సింగరాజు మొదలగువారి వర్థంతుల సందర్భంగా ఆ అమరనేతలకు జోహార్లు పలుకుతూ వెలువడిన పలు సంపాదకీయాలు నేటి తరం ఉపాధ్యాయులకు ఉద్యమ కర్తవ్యాలు నూరి పోసేవిగా వుంటున్నాయి. అలాగే ఫెడరేషన్లో నిబద్ధతతో పనిచేసిన నాయకులు మరణించినపుడు కూడా వారి జీవితాలను విశ్లేషిస్తూ సంపాదకీయాలు వెలువడినాయి.

విదేశీ విధానాలపట్ల వివిధ దేశాల రాజకీయ పరిణామాలు, ఆర్థిక అంశాలు, విద్యా విధానాలు మొదలైన అంశాల గురించి కూడా విజ్ఞాన దాయకమైన సంపాదకీయాలు వెలువడినాయి. ముఖచిత్రాలు'ఉపాధ్యాయ’ ప్రచురించిన ముఖచిత్రాలకు కూడా గొప్ప ప్రాధాన్యతను కల్పించింది. కేవలం అందం కోసమే ముఖచిత్రం కాకుండా సందర్భోచితమైన ముఖచిత్రాలను మాత్రమే ప్రచురించింది.తొలి సంచిక మహాత్మాగాంధీని ప్రచురించి, అంతకు ముందు నెలలో హత్యకు గురైన ఆయనకి నివాళి అర్పించింది. రెండవ సంచికలో రాష్ట్ర మహాసభల ఊరేగింపు దృశ్యాలను, మూడవ సంచికకు మద్రాసు ఎలిమెంటరీ టీచర్స్ ఫెడరేషన్ కార్యదర్శి వి.రాముణ్ణి ముఖచిత్రం. ఇలా ప్రముఖమైన ప్రతి సందర్భాన్ని తన అట్టమీద ముద్రించుకొంది ఉపాధ్యాయ. వీటితోపాటు పేదరికంతో మగ్గే బాలురు, బడికి దూరంగా వుండే బాలకార్మికులు, విద్యారంగంపై వచ్చిన వ్యంగ్య కార్టూన్లు కూడా 'ఉపాధ్యాయ' ముఖచిత్రాలు వచ్చాయి. శంకర్స్ వీక్లీ నుండి తీసుకున్నవి. వివిధ దిన పత్రికలలో వచ్చిన కార్టూన్లు కూడా భావస్ఫోరకమైన అర్ధాన్ని ప్రతిబింబించే విధంగా ముఖచిత్రాలను ప్రచురించింది. వీటితోపాటు పాల్రాబ్సన్, రవీంద్రనాథ్ ఠాగూర్, తాపీ ధర్మారావు, అడవి బాపిరాజు, పుట్టపర్తి నారాయణాచార్యులు, బళ్ళారి రాఘవ, కందుకూరి, గురజాడ, జాషువా, గిడుగు రామ్మూర్తి మొదలైన సాహితీ ప్రముఖులు. వినోబా, నెహ్రూ, తిలక్, శాస్త్రి, అంబేద్కర్, సర్వేపల్లి మొదలైన జాతీయ నాయకులు, భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వంటి విప్లవ మూర్తులు బొమ్మల్ని కూడా ముఖచిత్రాలుగా వెలువడినాయి. అంతేకాక ప్రకృతి బీభత్సాలు సంభవించినపుడు,వరదలు, సునామీ, భూకంపాలు మొదలగు ప్రతి సందర్భాన్ని 'ఉపాధ్యాయ' ముఖచిత్రంగా ప్రకటించింది. ఇంకా ఇరాక్ పై దాడిలో గాయాల పాలైన పసిపిల్లల హృదయ విదారక దృశ్యాన్ని, లక్నోలో చీరల పంపిణీలో మరణించిన అమాయక ప్రజల ఆర్తనాదాల్ని 'ఉపాధ్యాయ' ముఖచిత్రంగా ప్రకటించింది. ఇంకా 21వ శతాబ్దంలో కూడా అనాగరికంగా వున్న ఒరిస్సా 'బొండా' జాతి గిరిజన మహిళ చిత్రం కూడా 'ఉపాధ్యాయ' ముఖచిత్రంగా వెలుగు చూసింది.

ఇక ఉద్యమ ఫోటోలు, అమరనేతల ఫోటోలు ఎప్పటికప్పుడు 'ఉపాధ్యాయ'పై ముఖచిత్రాలుగా వస్తూనే వున్నాయి.ఇలా ముఖచిత్రాలను ప్రచురించడంలో వాటిని ఆకర్షణీయంగా మలచడంలో అందుబాటులో వున్న అన్ని సాంకేతిక సౌకర్యాలను వినియోగించుకొంటు తన ప్రత్యేకతను నిలుపుకొంటు వస్తోంది.వీటితోపాటు 50, 60 ప్రాంతాలలో అట్టవెనుక వచ్చిన ప్రకటనల్లో పుట్టిల్లు, లక్ష్మమ్మ, రాజముక్తి వంటి సినిమా ప్రకటనలు అలనాటి జ్ఞాపకాలను గుర్తుచేసేవిగా వున్నాయి. పత్రిక నిర్వహణ-ఇబ్బందులు‘ఉపాధ్యాయ' నిర్వహించిన సర్వతోముఖ కృషి అంతా పూలపై నడకలా సాగలేదు. కష్టాల్లో పుట్టి కడగండ్లలో పయనించి నేడు 60 వసంతాల వేడుకలకు సిద్ధం కావడం వెనుక ఫెడరేషన్ ఆశయసిద్ధి, ప్రకటిత లక్ష్యాలు వుండగా, పత్రిక పాటించే విలువలు, పత్రిక కుండాల్సిన నిజాయితీ పత్రికను ఇన్నేళ్ళు విజయవంతంగా కొనసాగించగలిగాయి. ఈ సుదీర్ఘ ప్రయాణంలో కష్టాలు, కడగండ్లు అన్నింటిని మనోనిబ్బరంతో ఎదుర్కొంది.

మూడు రూపాయల సంవత్సర చందాతో ప్రారంభమై 60 సంవత్సరాల చందాకు చేరింది. పత్రిక స్వయంపోషకత్వం కావడం కోసం అనేక ప్రయత్నాలు చేసింది. చందాల సంఖ్య పెరగడం ద్వారా మాత్రమే పత్రిక స్వయంపోషకం కాగలదని ఆనాడు, ఈనాడు 'ఉపాధ్యాయ' నమ్ముతోంది. పత్రికకు చందాదారులే పోషకులు. చందాలు చేర్పించే కార్యకర్తలే పత్రిక రధానికి సారధులు. 1948లో 280 చందాలతో ప్రారంభం అయిన చందాలు నేడు 12,000-15,000 మధ్య ఉన్నాయి. జీవిత చందాలు, ప్రత్యేక నిధి వసూళ్ళు ఇలా గతంలో అనేక ప్రయత్నాలు చేస్తేగాని పత్రిక నెలనెలా తీసుకొని రావడం సాధ్యంకాని పరిస్థితి. దీనిని అధిగమించడానికి ప్రకటనలు, వివాహ కానుకలు....ఇలా పత్రికను ఆర్థిక యిబ్బందుల నుండి గట్టెక్కించ డానికి అన్ని విధాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చందాల సంఖ్య పెంచుకోవడం కనీసం 25,000కు తగ్గకుండా చందాలు సేకరించడం ఒక లక్ష్యంగా ప్రతి కార్యకర్త భావించాలి. అప్పుడే పత్రిక నిలదొక్కుకోగలదు.

'ఉపాధ్యాయ' విజయం కార్యకర్తల విజయం మాత్రమే. ఇది నిలబెట్టుకొనే బాధ్యత కూడా వారిదే..

ఈ సందర్భంలో పత్రిక సంపాదకులుగా పనిచేసిన మహనీయులు చెన్నుపాటి, సింగరాజు, విజయరామరాజు, వై.సూర్యనారాయణలు మన మధ్య లేకపోయినా వారు ‘ఉపాధ్యాయ' ప్రగతికి చేసిన కృషి 'ఉపాధ్యాయ' విజయం వెనుక వుంది. అలాగే గతంలో పనిచేసిన సమతారావు, ఎన్. పరమేశ్వరరావు, ఎస్.వి.రాఘవయ్య, సి. హెచ్. ప్రభాకరరావు గార్లు పత్రిక నిర్వహణలో విశేష కృషి చూపి పత్రిక ప్రతిష్ట పెరగడంలో దోహదపడ్డారు. వారికి ఈ వజోత్సవాల సందర్భంగా ఉద్యమాభివందనాలు. వీరేకాక, తొలి నుండి నేటి వరకు పత్రికకు సంపాదక మండలి సభ్యులుగా వున్నవారికి, పత్రికకు రచనలు పంపిస్తున్న రచయితలకు, మేథావులకు, పత్రికను సకాలంలో ముద్రిస్తున్న కార్మిక సోదరులకు, ఇతర సాంకేతిక సిబ్బందికి, పత్రికకు ప్రకటనలు యిస్తున్న శ్రేయోభిలాషులకు ఉద్యమాభివందనాలు, పత్రిక చందాదారులకు చందాలు చేర్పిస్తున్న కార్యకర్తలకు వజోత్సవ శుభాకాంక్షలు. అభివందనములతో,

 

                                                                               భానుమూర్తి

                                                         ప్రధాన సంపాదకులు సంపాదక మండలి తరుపున